మహానగరంలో మారణ 'హోర్డింగ్ లు'

By సుభాష్  Published on  23 Jan 2020 1:49 PM IST
మహానగరంలో మారణ హోర్డింగ్ లు

హైదరాబాద్ మహానగరంలోని ఏదో ఒక పెద్ద క్రాస్ రోడ్ లో ఓసారి తలెత్తి చూడండి. ఎక్కడ చూసినా హోర్డింగులే హోర్డింగులు కనిపిస్తాయి. “మా బంగారమే కొనండి” అంటూ ఓ సినీ తార, “నాకు డబ్బిచ్చిన మొబైల్ నే మీరు కొనండి” అంటూ ఒక హీరో, “చీరలు కొనకపోతే చీరి పారేస్తా” నని బెదిరించే ఇంకో వస్త్రాలయం, “మా పెద్దన్నపుట్టిన రోజు శుభాకాంక్షలు” అని చెప్పే కుర్ర గూండా.. ఇలా రకరకాల హోర్డింగులు కనిపిస్తాయి.

అయితే వీధి దీపాలు, టెలికాం స్తంభాలు, విగ్రహాల దిమ్మెలు, షాపుల పైన ఉండే చాలా హోర్డింగులు అనుమతి లేకుండా పెట్టినవే. భారీగా ఈదురు గాలులు, వానలు వచ్చినప్పుడు ఇలాంటి హోర్డింగులు కూలిపోయిన సంఘటనలూ ఉన్నాయి. ఆ మధ్య చెన్నైలో ఒక అన్నా డీఎంకే నేత తన కుమారుడి పెళ్లికి పెట్టించిన హోర్డింగ్ కుప్పకూలి భానుశ్రీ అనే ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ చనిపోయింది కూడా. అందుకే మన జీ హెచ్ ఎం సీ ఇలాంటి అక్రమ హోర్డింగ్ ల పై యుద్ధాన్ని ప్రకటించింది గత అక్టోబర్ నుంచి ఇప్పటి దాకా దాదాపు 8.6 లక్షల పోస్టర్లు, బ్యానర్లు, హోర్డింగ్ లను తొలగించింది. అంతే కాదు. అక్రమ హోర్డింగ్ లను పెట్టిన కంపెనీలకు జరిమానా విధించి రూ. 1.48 కోట్లను సంపాదించింది.

ఇలా అక్రమ హోర్డింగ్ లు పెట్టి భారీ జరిమానాలను చెల్లించుకున్న ఏడు కంపెనీలలో నాచురల్ హెయిర్ ట్రీట్ మెంట్, బ్రిటిష్ స్పోకెన్ ఇంగ్లీష్, ది వెంకట్ జాబ్స్ ఇన్ ఎం ఎన్ సీ, ఆక్ట్ ఫైబర్ నెట్, రాపిడో, బిల్ సాఫ్ట్ టెక్నాలజీస్, హాత్ వే బ్రాడ్ బ్యాండ్ లు ఉన్నాయి. నాచురల్ హెయిర్ ట్రీట్ మెంట్ రూ. 39 లక్షలు, బ్రిటిష్ స్పోకెన్ ఇంగ్లీష్ రూ 33 లక్షలు, వెంకట్ జాబ్స్ రూ. 29 లక్షలు, ఆక్ట్ ఫైబర్ రూ. 14 లక్షలు, రాపిడో రూ. 13.79 లక్షలు, బిల్ సాఫ్ట్ రూ. 9.38 లక్షలు, హాత్ వే రూ. 13 లక్షలు జరిమానా చెల్లించాయి.

అక్రమ హోర్డింగ్ లపై కొరడా ఝళిపించేందుకు జీ హెచ్ ఎం సీ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం సెంట్రల్ ఎన్ ఫోర్స్ మెంట్ సెల్ ను ఏర్పాటు చేసింది. హోర్డింగ్ ల విషయంలో పౌరులు ఈ విభాగానికి ఫిర్యాదు చేయవచ్చు. గత అక్టోబర్ నుంచి 44,403 ఫిర్యాదులు వచ్చినట్టు జీ హెచ్ ఎం సీ అధికారులు తెలియచేశారు.

Next Story