రివ్యూ : 'హిట్' - హిట్ కి తక్కువ ఫట్ కి ఎక్కువ !

By రాణి  Published on  28 Feb 2020 8:05 AM GMT
రివ్యూ : హిట్ - హిట్ కి తక్కువ ఫట్ కి ఎక్కువ !

క్రేజీ హీరో విశ్వక్ సేన్ హీరోగా రుహాని శర్మ హీరోయిన్ గా శైలేష్ దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని నిర్మాతగా తెరకెక్కించిన సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం “హిట్”. యూత్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న విశ్వక్ ఈ సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నాడు. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ఈ సినిమా పై ఎలా ఉందో రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :

విక్రమ్ రుద్రరాజు(విశ్వక్ సేన్) ప్యానిక్ అటాక్ డిజార్డర్ తో బాధపడే ఓ క్రైమ్ ఆఫీసర్. అయితే అనుకోకుండా తాను ప్రేమించిన అమ్మాయి రుహాని శర్మ మిస్సయిపోతుంది. అలాగే మరోపక్క ప్రీతి అనే అమ్మాయి కూడా మిస్సవుతుంది. ఈ రెండు ఛాలెంజింగ్ కేసులు అతను ఎలా డీల్ చేస్తాడు ? అసలు ఈ కేసుల వెనుక ఉన్నది ఎవరు? విక్రమ్ రుద్రరాజు ఈ రెండు కేసులను చేధించాడా ? లేదా ? ఇంతకీ విక్రమ్ గత జీవితం ఏమిటి ? ఆ గతానికి ఈ కేసులకు ఏమైనా సంబంధం ఉందా ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రాన్ని వెండితెర పై చూడాల్సిందే.

నటీనటులు :

ఈ సినిమాలో హీరోగా నటించిన విశ్వక్ సేన్ నటన సినిమాలోనే హైలెట్ గా నిలుస్తోంది. ముఖ్యంగా విశ్వక్‌ సేన్‌ ఎమోషనల్ సన్నివేశాలతో పాటు యాక్షన్ సీన్స్ లో కూడా చాలా బాగా నటించాడు. తన నటనతో పాటు డైలాగ్ మాడ్యులేషన్ తో కూడా విశ్వక్‌ సేన్‌ ఆకట్టుకుంటాడు. ఇక హీరోయిన్ గా నటించిన రుహాని తన గ్లామర్ తోనే కాకుండా.. తమ నటన పరంగా కూడా బాగా చేసింది. ఇక 'యస్.ఐ'గా నటించిన నటుడు కూడా సినిమాలో కనిపించనంతసేపూ బాగానే ఆకట్టుకున్నాడు. అలాగే ఇన్వెస్టిగేషన్ లో సహాయకుడు రోహిత్ రోల్ చేసిన నటుడు చైతన్య మరియు కానిస్టేబుల్ పాత్ర చేసిన మురళి శర్మ అలాగే బ్రహ్మజీ పాత్రల పరిధిలో చక్కగా నటించారు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు.

సాంకేతిక విభాగం :

ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. సంగీత దర్శకుడు అందించిన సంగీతం బాగుంది. ఇక ఎడిటర్ అనవసరమైన సీన్స్ ని ట్రీమ్ చేసి చేయాల్సింది. సినిమాటోగ్రఫీ చాల బాగుంది. కెమెరా వర్క్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. విజువల్స్ ను కెమెరామెన్ చాలా అందంగా చూపించారు. ఇక దర్శకుడు సరైన స్క్రిప్ట్ ను రాసుకోవడంలో విఫలం అయ్యారు. దర్శకత్వం పర్వాలేదు. ఇక నిర్మాతగా నాని నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. కథకు అవసరమైనంత ఖర్చు పెట్టారు.

అయితే ఇలాంటి డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తీసుకున్నపుడు ఆ కాన్సెప్ట్ కి తగ్గట్టు సినిమా ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తూ ర‌క్తి కట్టేలా సాగాలి, కానీ ఈ సినిమాలో కొన్ని క్రైమ్ సీన్స్ మినహా మిగతా సన్నివేశాలు అంతగా ఆకట్టుకోవు. దర్శకుడు సెకండాఫ్ ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఇంట్రస్ట్ గా నడుపుదామని మంచి ప్రయత్నం అయితే చేశారు గాని, అది స్క్రీన్ మీద ఎఫెక్టివ్ గా వర్కౌట్ కాలేదు. దీనికి తోడు మెయిన్ గా సినిమా గందరగోళంగా సాగుతూ బోర్ కొడుతోంది.

ప్లస్ పాయింట్స్ :

నటీనటుల నటన,

ఇంట్రస్ట్ గా సాగే క్రైమ్ స్టోరీ

స్క్రీన్ ప్లే

బ్యాక్ గ్రౌండ్ స్కోర్

మైనస్ పాయింట్స్ :

స్లో నేరేషన్,

కొన్ని సీన్స్ బోర్ గా సాగడం,

కొన్ని చోట్ల లాజిక్ మిస్ అవ్వడం.

సీరియస్ గా సాగే ట్రీట్మెంట్

పెద్దగా కమర్షియల్ హంగులు లేకపోవడం

చివరగా..

'హిట్' అంటూ వినూత్నమైన కాన్సెప్ట్ తో వచ్చిన ఈ చిత్రం.. పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదు. ఐతే విశ్వక్ సేన్ నటన, రఫ్ ఆటిట్యూడ్ డైలాగ్ డెలివరీ ఆకట్టుకుంటాయి. కానీ, ఇంట్రస్టింగ్ గా సాగని ట్రీట్మెంట్ తో పాటు లాజిక్ లేని సన్నివేశాలతో సినిమా బోర్ గా సాగుతోంది. పైగా సినిమాలో ఫేక్ ఎమోషన్స్ వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. ఓవరాల్ గా ఈ సినిమా జస్ట్ పర్వాలేదు అనిపిస్తోంది.

రేటింగ్ 2.25 /5

Next Story