గొట్టిప్రోలు మట్టి కింద ఏం దాగుంది..? వేల ఏళ్ల చరిత్ర ఏం చెబుతోంది..?

By సత్య ప్రియ  Published on  1 Nov 2019 11:22 AM GMT
గొట్టిప్రోలు మట్టి కింద ఏం దాగుంది..? వేల ఏళ్ల చరిత్ర ఏం చెబుతోంది..?

భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ), ఆంధ్ర ప్రదేశ్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గొట్టిప్రోలు లో చేపట్టిన తవ్వకాలలో అద్భుతమైన విషయాలు బయట పడ్డాయి. సుమారు 2000 ఏళ్ల క్రితం, ఆ ప్రదేశంలో భారీ స్థావరాలు నెలకొని ఉండేవని, పెద్ద వాణిజ్య కేంద్రంగా ఆ స్థలం విలసిల్లిందని తెలుస్తోంది.



నాయుడుపేట లో మొదటి దఫా తవ్వకాలను పూర్తి చేసుకున్న ఏఎస్ఐ బృందం, 2000 ఏళ్ల నాటి ఇటుక నిర్మాణాలనూ, పొడవాటి విష్ణుమూర్తి విగ్రహాన్నీ వెలికితీసారు. అంతేకాకుండా, మట్టితో చేసిన వివిధ పాత్రలను బయటకి తీసారు. ఈ స్థావరాలు శాతవాహనుల, ఇక్ష్వాకుల కాలం నాటివి అయ్యుండొచ్చని చరిత్ర కారులు నమ్ముతున్నారు. 75 మీటర్ల మేర పొడవు, 3.4 మీటర్ల వెడల్పు, 2 మీటర్ల ఎత్తు ఉన్న ఈ స్థావరాలు, కాల్చిన ఇటుకలు వాడి కట్టబడినవి.



దీర్ఘచతురస్రాకారంలో ఉండే ట్యాంక్ ఒకటి తవ్వకాలలో కనిపించింది. దీని నిర్మాణంలో వాడిన ఇటుకల (43 -48 సి ఎం) పరిమాణాలు, అమరావతి, నాగార్జునకొండలలో శాతవాహనులు, ఇక్ష్వాకులు వాడిన ఇటుకల పరిమాణం ఇంచుమించు ఒకటే.



విష్ణుమూర్తి విగ్రహం, సుమారు 2 అడుగుల ఎత్తు ఉంది. శంకు చక్రాలను అలంకరించి రెండు చేతులు, వరద, కటి హస్తాలతో మొత్తం నాలుగు హస్తాలు కలిగి ఉంది ఆ విగ్రహం.



వివరంగా చెక్కబడిన కిరీటం, లావుపాటి పవిత్ర జంధ్యం, అలంకరణ చూస్తే, ఆ విగ్రహం పల్లవుల కాలం నాటిదిగా తెలుస్తోంది.



తూర్పు దిశ తవ్వకాలలో, మట్టి పాత్రలు ఎన్నో లభించాయి. జాడీల రూపంలో, కుండల రూపంలో మట్టి పాత్రలు ఉన్నాయి. ఇవి తమిళనాట ఎక్కువగా లభ్యం అయ్యేవి.



ఒకదానిలో ఒకటి పేర్చబడినట్టుగా మట్టి పైపులు లభించాయి. ఇది నీటి పారుదల వ్యవస్థలో భాగమని చరిత్ర కారులు భావిస్తున్నారు.



రాతి యుగం, నియోలిథిక్ యుగానికి చెందిన కొన్ని పని ముట్లు కూడా లభించాయి.



సముద్రానికి దగ్గరలో ఉండడం వల్ల ఈ ప్రాంతంలో సముద్ర వాణిజ్యం ముమ్మరంగా జరిగి ఉండొచ్చని తెలుస్తోంది. ఇంకా పరిశోధనలు జరగాల్సి ఉన్నాయి. అనుకరించబడిన అంఫొరే పాత్రలు, సముద్ర వాణిజ్యంలో ద్రవ్య పదార్ధాలను సరఫరా చేసెందుకు వాడి ఉండవచ్చని ఏఎస్ఐ శాస్త్రవేత్తలు చెప్తున్నారు.





అంతేకాకుండా, ఈ తవ్వకాలలో రాగి నాణేలు, ఇనుప ఈటె, టెర్రకోట పూసలు లభ్యం అయ్యాయి.



స్వర్ణముఖీ నదికి కుడి వైపున, నాయుడుపేట కు 17 కిమి తూర్పు దిక్కుగా, తిరుపతి నుంచి 80 కిమిల దూరం లో ఉంది ఈ స్థలం. చరిత్రలో ఈ ప్రాంతం వాణిజ్యంలో చాలా ముఖ్యమైన పాత్ర పొషించి ఉండవచ్చు.

Next Story