విశాఖలో తీవ్ర ఉద్రిక్తత..రెండు గంటలుగా ఒకటే నాటకం..

By రాణి  Published on  27 Feb 2020 8:29 AM GMT
విశాఖలో తీవ్ర ఉద్రిక్తత..రెండు గంటలుగా ఒకటే నాటకం..

విశాఖపట్నంలో చంద్రబాబు నాయుడు కాన్వాయ్ కి చేదు అనుభవం ఎదురైంది. ప్రజా చైతన్య యాత్రలో భాగంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు పార్టీ నేతలతో కలిసి విశాఖలో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో విశాఖలో చంద్రబాబు నాయుడు పర్యటిస్తే ఘర్షణలు జరుగుతాయని ముందే ఊహించిన పోలీసులు ఎయిర్ పోర్ట్ వద్ద బందోబస్త్ చేశారు. కాగా..చంద్రబాబును విమానాశ్రయం వద్దే అడ్డుకోవాలంటూ పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు సోషల్ మీడియాలో పిలుపునిచ్చారు. తగ్గట్టుగానే వైసీపీ శ్రేణులు ఎయిర్ పోర్టుకు వెళ్లే రోడ్డుపై బైఠాయించి చంద్రబాబుకు వ్యతిరేక నినాదాలు చేశారు. పోలీసులు వారిని అడ్డుకుని వెనక్కి పంపిన తర్వాత..చంద్రబాబు నాయుడికి స్వాగతం పలికేందుకు టీడీపీ నేతలు, కార్యకర్తలు ఎయిర్ పోర్ట్ వద్దకు చేరుకున్నారు. వారితోపాటుగానే వైసీపీ శ్రేణులు కూడా ఎయిర్ పోర్ట్ వద్దకు రావడంతో..ఇరువురి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. అధికార, ప్రతిపక్షాల నేతలు ప్లకార్డులు చేపట్టి..పరస్పరం వ్యతిరేక నినాదాలు చేయడంతో పోలీసులు వారందరినీ చెదరగొట్టారు. అనంతరం ఎయిర్ పోర్ట్ ప్రాంగణం, ఎయిర్ పోర్టుకు వెళ్లే రహదారిని పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య నెలకొన్న తీవ్ర వాగ్వాదం జరగడంతో..ఆ రోడ్డు వద్ద ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది.

కాగా..గురువారం చంద్రబాబు నాయుడు విశాఖలో పర్యటించేందుకు పోలీసులు అనుమతివ్వలేదు. దీంతో టీడీపీ శ్రేణులు ర్యాలీగా ఎయిర్ పోర్ట్ కు వెళ్లి చంద్రబాబుకు స్వాగతం పలుకాలని నిర్ణయించుకున్నారు. మధ్యలో పోలీసులు అడ్డుకోవడం వారి ప్రయత్నం ఫలించలేదు. టీడీపీ నేత అనితతో పాటు ఇతర టీడీపీ నేతలు కూడా ఎయిర్ పోర్ట్ వద్ద చంద్రబాబు నాయుడికి స్వాగతం పలికేందుకు ఎయిర్ పోర్ట్ కు చేరారు.

చంద్రబాబు నాయుడిని అడ్డుకునేందుకు ఎయిర్ పోర్ట్ వద్దకు భారీ సంఖ్యలో వచ్చిన వైసీపీ శ్రేణులను చూసి ప్రయాణికులు ఖంగుతిన్నారు. వైసీపీ కార్యకర్తల చేష్టలు చూసిన ప్రయాణికులకు నోట మాట రాలేదు. చంద్రబాబు కాన్వాయ్ విమానాశ్రయం నుంచి బయల్దేరగానే వైసీపీ శ్రేణులు కాన్వాయ్ పై చెప్పులు, కోడిగుడ్లు, టమాటాలు విసిరారు. కాన్వాయ్ కు అడ్డంగా వైసీపీ కార్యకర్తలు పడుకోవడంతో ఆ ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విమానాశ్రయం వద్ద నుంచి చంద్రబాబు కాన్వాయ్ కదలడమే గగనమైపోయింది. అక్కడి నుంచి కాన్వాయ్ ముందుకు రావడానికే గంట సమయం పట్టింది.

మరోవైపు పోలీసుల చేతగానితనం పై టీడీపీ నేతలు పెదవి విరుస్తున్నారు. వైసీపీ కార్యకర్తలు అంత హంగామా చేస్తుంటే..పోలీసులు ఉదయం నుంచీ సినిమా చూసినట్లు చూస్తున్నారే తప్ప ఏమీ చేయలేక పోతున్నారని విమర్శించారు.

Next Story