వెంటపడి, నప్పించి, ఒప్పించి, మెప్పించి..నిఖిల్ ప్రేమ కథ

By రాణి  Published on  7 Feb 2020 2:41 PM IST
వెంటపడి, నప్పించి, ఒప్పించి, మెప్పించి..నిఖిల్ ప్రేమ కథ

అలా మొదలైంది...

శ్రీవారికి ప్రేమలేఖ సినిమాలో “తొలి సారి నిన్ను చూసింది మొదలు... మదిలోన మెదిలాయి ఎన్నెన్నో కలలు” పాట గుర్తుందా. కార్తికేయ, హ్యాపీడేస్ హీరో నిఖిల్ కు కూడా డా. పల్లవి వర్మను చూడగానే ఈ పాటే మోగినట్టయింది. మొదట “నువ్వు నాకు నచ్చావు” అనుకున్నాడు. ఆ తరువాత “నువ్వే నేను” అనుకున్నాడు. ఇక నెక్స్ట్ “నువ్వు లేక నేను లేను” అనే స్టేజ్ వచ్చేసింది. ఆ తరువాత “ప్రేమించుకుందాం రా” .. ఇంకొన్నాళ్లకి “ఆటాడుకుందాం రా” దశలు దాటేశాడు. “నిన్నే పెళ్లాడతా” అని మనసులోనే మన కార్తికేయ అనుకున్నాడు. ఆ తరువాత “పెళ్లిచేసుకుందాం” అన్నాడు. పల్లవి కూడా దాదాపు అదే పాటలు ... అదే వరుసలో పాడేసుకుంది. ఫైనల్ గా ఇప్పుడు ఇద్దరూ “అహ...నా పెళ్లంట” అనుకుంటున్నారు.

టూకీగా హీరో నిఖిల్ సిద్ధార్థ ప్రేమ గాథ ఇది

ఇదంతా ఆరంటే ఆరు నెలల్లో జరిగిపోయింది. ఆరు నెలల క్రితం మిత్రులు నిఖిల్ కు పల్లవిని ఒక పార్టీలో పరిచయం చేశారు. నిఖిల్ నాకౌట్ అయిపోవడానికి పట్టుమని పది సెకన్లు పట్టలేదు. “ఇంకెవరితోనైనా పెళ్లి ప్రస్తావన వస్తే నవ్వేసి ఎత్తగొట్టేసేవాడిని. కానీ పల్లవిని చూడగానే “నే పడిపోయా .. పడిపోయా....” అని పాటేసుకున్నాడు. “అప్పుడేనా... నాకా... పెళ్లా” అనుకునే లోపల ఓ అందమైన సాయంత్రం గోవా బీచ్ లో పల్లవి ముందు మోకాలిపై కూర్చుని, పువ్వును చేతికిస్తూ “విల్యూ మ్యారీ మీ” అని ప్రపోజ్ చేసేశాడు మన నిఖిల్. పల్లవి కూడా క్షణం ఆలోచించకుండా “స్వామి రారా” అనేసింది. మొత్తానికి “అలా మొదలైంది”.

Hero Nikhil Love Story 3అయితే నిఖిల్ మాటల్లో చెప్పాలంటే తనకి ఇది లవ్ ఎట్ ఫస్ట్ సైటే అయినా, పల్లవిని ఒప్పించడం మాత్రం అంత సులువుగా జరగలేదు. దూకుడులో సమంత చెప్పినట్టు “టైప్ టూ మగాడిలా” వెంటపడి, నప్పించి, ఒప్పించి, మెప్పించి, యుద్ధాలు జరిపించిన తరువాత కానీ పల్లవి ఒప్పుకోలేదు. కొన్నాళ్లు వెంటపడిన తరువాత ఆమె కూడా “నచ్చావులే” అనుకునేలా చేయగలిగాడు.

ఆ తరువాత ఒక ప్రైవేటు ఫంక్షన్లో ఇద్దరూ ఎలాంటి హడావిడీ ఆర్భాటం లేకుండా ఉంగరాలు మార్చుకున్నారు. ఇందులో ఇంకో తమాషా ఉంది. నిఖిల్ పక్కా తెలంగాణ పొరడు. పల్లవి నూటొక్క పాళ్ల ఆంధ్రా పిల్ల. ఆమెది భీమవరం. బెంగుళూరులోని ఎంవీజే కాలేజీనుంచి ఎంబీబీఎస్ చేసి, హైదరాబాద్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తోంది. నిఖిల్ లాగే ఆమె కూడా పని రాక్షసి. గంటల కొద్దీ పని చేస్తూనే ఉండగలదు. అంతే కాదు. నిఖిల్ మనసును అర్థం చేసుకోగలదు. అర్జున్ సురవరం సినిమా రిలీజ్ ఆలస్యమై నిఖిల్ మానసిక ఒత్తిడికి లోనైనప్పుడు ఓదార్పు టానిక్, ప్రేమ మందు ఇచ్చి లవ్ ట్రీట్ మెంట్ చేసింది పల్లవే. Hero Nikhil Love Story 2

నిఖిల్ పల్లవిల “పీపీపీ డుండుండుం...” ఇక ఏప్రిల్ 16 న విడుదల కాబోతోంది. ముందుగానే హిట్ డిక్లేర్ అయిన ఈ లవ్ స్టోరీని తప్పక చూడండి....!!

Next Story