హీరో నాగశౌర్యపై మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు

By రాణి  Published on  7 Feb 2020 12:57 PM GMT
హీరో నాగశౌర్యపై మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు

సినిమా హీరో నాగశౌర్య పై తెలంగాణ రాష్ర్ట టాక్సీ డ్రైవర్స్ జేఏసీ నాయకులు మానవహక్కుల కమిషన్ లో ఫిర్యాదు చేసింది. ఒక ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగశౌర్య డ్రైవర్ల ను అవమానించేలా మాట్లాడాడని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. కొంతమంది చదువు ఉండి కూడా డ్రైవర్ వృత్తిని ఎంచుకుంటారని, మద్యానికి బానిసై వివిధ నేరాలకు పాల్పడుతారని శౌర్య వ్యాఖ్యానించినట్లు కమిషన్ కు వివరించారు. నాగశౌర్య చేసిన వ్యాఖ్యలు తమ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని, వెంటనే అతను బహిరంగంగా తమకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

నాగశౌర్య నటించిన అశ్వద్ధామ సినిమా ఇటీవలే విడుదలై కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా నాగశౌర్య కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిపోతుందని పలువురు సినీ నటులు కూడా పేర్కొన్నారు. సినిమా ప్రమోషన్ల కోసం నాగశౌర్య ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆడపిల్లలపై జరిగే నేరాల గురించి ప్రస్తావించారు. అలాగే డ్రైవర్ వృత్తిలో ఉన్నవారు చేసే పనులేంటో ఆయన చెప్పుకొచ్చారు. కాగా..అందరు డ్రైవర్లు ఇవే పనులు చేయరంటూ టీఎస్ డ్రైవర్ల జేఏసీ అసహనం వ్యక్తం చేసింది.

Next Story
Share it