హీరో బైక్‌ కొనుగోలు చేశారా..? అయితే మీకో గుడ్‌న్యూస్‌

By సుభాష్  Published on  9 April 2020 9:25 AM GMT
హీరో బైక్‌ కొనుగోలు చేశారా..? అయితే మీకో గుడ్‌న్యూస్‌

కరోనా వైరస్‌ ప్రభావం అంతా ఇంతా కాదు. వ్యాపార రంగాలపై కూడా కరోనా ప్రభావం భారీగానే ఉంటుంది. ఈ వైరస్‌ కారణంగా ఇప్పటికే ఎంతో నష్టం వాటిల్లుతోంది. సామాన్యుల నుంచి వ్యాపారస్తుల వరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే వినియోగదారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని హీరో మోటోకార్ప్‌ కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్నందున తమ బైక్‌లు కొనుగోలు చేసిన కస్టమర్లకు వారంటీ, ఉచిత సర్వీస్‌, ఏఎంసీ సర్వీసు గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

మార్చి 21వ తేదీ నుంచి ఏప్రిల్‌ 30వ తేదీ మధ్యలో ఉచిత సర్వీస్‌ ముగిసేవారికీ గడువును 2020 జూన్‌ 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు పేర్కొంది. మార్చి 21 నుంచి ఏప్రిల్‌ 30 మధ్యలో హీరో బైక్‌లకు ఉచిత సర్వీసింగ్‌, వారంటీ ముగిసినా ఇబ్బంది ఉండదు. గడువు పొడిగింపుతో జూన్‌ 30వ తేదీ వరకు వినియోగించుకోవచ్చు.

లాక్‌డౌన్‌ కారణంగా సేవలు అందించలేని కారణంగా హీరో మోటోకార్ప్‌ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ అవకాశం బైకులు, స్కూటర్లకు మాత్రమే వర్తిస్తుంది. ఇక స్థానిక అధికార యంత్రాంగం అనుమతి ఇచ్చిన ప్రాంతాల్లో రోడ్‌ సైడ్‌ అసిస్టెన్స్‌ ఇస్తున్నట్లు హీరో మోటోకార్ప్‌ ప్రకటించింది. సేల్స్‌, ఆప్టర్‌సేల్స్‌, సర్వీస్‌, వారంటీ లాంటి ఏమైనా సందేహాలుంటే 24 గంటల పాటు పని చేసే టోల్‌ ఫ్రీ నెంబర్‌ 18002660018కు కాల్‌ చేసే వివరాలు తెలుసుకోవాలని తెలిపింది.

Next Story