ఊబకాయం ఉన్న పిల్లల్లో 60% మందికి ఫ్యాటీ లివర్ డిసీజ్: ఏఐజీ చీఫ్ డాక్టర్ డీఎన్ రెడ్డి

కాలేయ వ్యాధులు చాలా వేగంగా పెరుగుతున్నాయని ఏఐజీ చీఫ్ డాక్టర్ డీఎన్ రెడ్డి అన్నారు.

By News Meter Telugu  Published on  2 July 2023 9:14 AM GMT
obese children,  fatty liver, disease, Dr D Nageshwar Reddy

ఊబకాయం ఉన్న పిల్లల్లో 60% మందికి ఫ్యాటీ లివర్ డిసీజ్: ఏఐజీ చీఫ్ డాక్టర్ డీఎన్ రెడ్డి 

హైదరాబాద్‌లో జరిగిన లివర్ కాన్క్లేవ్ లో ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ చైర్మన్ డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ “భారతదేశంలో, కాలేయ వ్యాధులు చాలా వేగంగా పెరుగుతున్నాయని.. నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD), హెపటైటిస్ బి హెపటైటిస్ సి, హెపాటోసెల్యులర్ కార్సినోమా (లివర్ క్యాన్సర్) వంటి ప్రాణాంతక వ్యాధులతో కూడా పోరాడుతున్నాము” అని చెప్పుకొచ్చారు. ఊబకాయం ఉన్న పిల్లలలో సుమారు 60 శాతం మంది ఫ్యాటీ లివర్‌ వ్యాధికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మధుమేహం, ఫ్యాటీ లివర్ లకు, సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం తీవ్ర పరిణామాలకు దారి తీస్తుందని అన్నారు. సిర్రోసిస్ (కాలేయం గట్టిపడటం), లివర్ ఫెయిల్యూర్ వంటివి కూడా జరిగే ప్రమాదం ఉందని తెలిపారు. కాలేయ వ్యాధులకు ముఖ్య కారణం మద్యపానం అని.. వాటితో కూడా మనం పోరాడుతూ ఉన్నామని తెలిపారు. పేలవమైన ఆహారపు అలవాట్లు, నిశ్చల జీవనశైలి ద్వారా సంభవించే మధుమేహం, ఫ్యాటీలివర్‌ వ్యాధుల కలయిక తీవ్రమైన సిర్రోసిస్‌ కు దారి తీస్తోందన్నారు. కాలేయ వైఫల్యానికి దారితీసే అతిపెద్ద కారణాలలో ఒకటి మద్యపానం కాగా ఇటీవలి కాలంలో అది మరింత పెరిగిందన్నారు.

కాలేయ వ్యాధి చికిత్సకు పేరొందిన గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్స్‌లో ఏర్పాటైన ప్రప్రథమ లివర్‌ కాన్‌క్లేవ్‌ శనివారంతో ముగిసింది. మూడు రోజుల పాటు జరిగిన ఈ మెగా లివర్ సదస్సులో భారతదేశం, ఇతర దేశాల నుండి 1,300 మందికి పైగా వైద్యులు పాల్గొన్నారు. కాలేయ వ్యాధులకు సంబంధించిన వివిధ అంశాలపై ఇందులో చర్చించారు. ఈ వ్యాధులపై పోరాడడానికి తాజా చికిత్సా విధానాల గురించి కూడా చర్చించారు. కాలేయ రోగులకు చికిత్స చేసే అన్ని స్థాయిల వైద్యుల కోసం ప్రత్యేక సెషన్‌లను నిర్వహించారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ సైన్సెస్, న్యూ ఢిల్లీకి చెందిన డాక్టర్ శివ్ సరిన్ హెపటాలజీపై పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఇందులో హెపాటాలజిస్టులు, గ్యాస్ట్రోఎంటరాలజిస్టులు, ఫిజిషియన్‌లు, కాలేయ నిపుణులు రాసిన వ్యాసాలు ఉన్నాయి, ఎంతో ఉపయోగపడే సమాచారం కూడా ఉంది.

"భారతదేశంలో మొదటిసారి నిర్వహించిన ఈ సదస్సు ఎంతో మంది వైద్యులకు కాలేయ రుగ్మతల గురించి అవగాహన కల్పించడానికి వేదికగా నిలిచిందని, ప్రపంచం నలుమూలల నుండి ఎంతో మంది కాలేయ నిపుణులు కలిసి వచ్చారు, ఇది లక్షలాది మంది రోగులకు సహాయం చేస్తుంది" అని డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో నోబెల్ గ్రహీత ప్రొఫెసర్ హార్వే జె ఆల్టర్ కీలక ప్రసంగం చేశారు. ఈ సదస్సులో తాను కనుగొన్న హెపటైటిస్‌ సి వైరస్‌ గురించి ప్రొఫెసర్‌ హార్వే జె ఆల్టర్‌ కీలక విషయాలను వెల్లడించారు. ఆల్కహాల్‌ వినియోగంతో సంబంధం లేకుండా కూడా కాలేయ వైఫల్యంతో అనేకమంది బాధపడుతున్నారని, తమ హెపటాలజీ విభాగంలో ఇంతకు ముందెన్నడూ లేని స్థాయిలో రోగుల్ని తాము చూస్తున్నామని ఆసుపత్రికి చెందిన హెపటాలజీ విభాగం డైరెక్టర్‌ డాక్టర్‌ మిథున్‌ శర్మ చెప్పారు.

ఈ సదస్సులో అంతర్జాతీయ కాలేయ నిపుణులు డాక్టర్ రాజేందర్ రెడ్డి, యూనివర్శిటీ ఆఫ్ పెన్సిల్వేనియా, USA, డాక్టర్ ప్యాట్రిక్ కామత్, మాయో క్లినిక్, USA, ప్రొఫెసర్ జూలియా వెండన్, కింగ్స్ కాలేజ్, లండన్, డాక్టర్ ఇలియట్ టాప్పర్, మిచిగాన్ విశ్వవిద్యాలయం, USA, డా. జస్మోహన్ బజాజ్, రిచ్‌మండ్ VA మెడికల్ సెంటర్ USA, ప్రొఫెసర్ గ్రేస్ వాంగ్, CUKH, హాంకాంగ్, డాక్టర్ అమిత్ సింగల్, UT సౌత్ వెస్ట్రన్ మెడికల్ సెంటర్, USA, డాక్టర్ అశ్వని సింగల్, శాన్‌ఫోర్డ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్, USA, ప్రొఫెసర్ జువాన్ పాబ్లో అరబ్, కెనడాలోని వెస్ట్రన్ యూనివర్శిటీకి చెందిన డాక్టర్లు పాల్గొన్నారు.

Next Story