హత్రాస్‌ కేసులో సీబీఐ దర్యాప్తును అలహాబాద్‌ హైకోర్టు పర్యవేక్షిస్తుంది: సుప్రీం కోర్టు

By సుభాష్  Published on  27 Oct 2020 10:25 AM GMT
హత్రాస్‌ కేసులో సీబీఐ దర్యాప్తును అలహాబాద్‌ హైకోర్టు పర్యవేక్షిస్తుంది: సుప్రీం కోర్టు

ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌ అత్యాచారం, హత్య కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అయ్యాయి. అయితే ఈ కేసుపై సీబీఐ చేస్తున్న దర్యాప్తును పర్యవేక్షించాల్సిందిగా అలహాబాద్‌ హైకోర్టును సుప్రీం కోర్టు ఆదేశించింది. హత్రాస్‌ జిల్లా బుల్‌గారి గ్రామంలో దళిత అమ్మాయిపై నలుగురు మానవ మృగాళ్లు సామూహిక అత్యాచారానికి పాల్పడి, ఆపై తీవ్రంగా హింసించి ఆమె చావుకు కారణమయ్యారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో దాఖలైన పిటిషన్లపై మంగళవారం సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ఈ కేసును సంబంధించి సీబీఐ జరుపుతున్న దర్యాప్తునను ఎప్పటికప్పుడు అలహాబాద్‌ హైకోర్టు పర్యవేక్షిస్తోందని సుప్రీం కోర్టు తెలిపింది. కేసును ఢిల్లీకి బదిలీ చేయాలనే అంశాన్ని తర్వాత పరిశీలిస్తామని తెలిపింది. సీబీఐ తన దర్యాప్తును పూర్తి చేసిన అనంతరం కేసు బదిలీపై నిర్ణయం తీసుకోవాలని ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ తన దర్యాప్తు వివరాలను అలహాబాద్‌ హైకోర్టుకు అందజేయాల్సి ఉంటుంది. ఈ కేసుకు సంబంధించి బాధిత కుటుంబ భద్రతను, సాక్షుల భద్రతను అలహాబాద్‌ హైకోర్టు చూసుకుంటుందని సుప్రీం కోర్టు తెలిపింది.

బాధితురాలి పేరు తొలగించాలంటూ విన్నపం

కాగా, హత్రాస్‌ కేసుకు సంబంధించిన ఆదేశాలలో బాధితురాలి పేరును తొలగించాలంటూ ఉత్త్రరప్రదేశ్‌ ప్రభుత్వం చేసుకున్న విన్నపాన్ని సుప్రీం కోర్టు మన్నించింది. బాధితురాలి పేరును తొలగించాలని అలహాబాద్‌ కోర్టుకు సూచించింది. ఈనెల 15న జరిగిన విచారణలో సుప్రీం కోర్టు తీర్పును రిజర్వ్‌ చేసింది.

Next Story