ఆర్టికల్ 370 చరిత్రలో కలిసిపోయింది.. మళ్లీ రాదు: అమిత్‌షా

జమ్ముకశ్మీర్‌లో ఎన్నికలు జరగనున్న సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అక్కడ కిశ్త్‌వార్‌లో పర్యటిస్తున్నారు.

By Srikanth Gundamalla  Published on  16 Sept 2024 4:13 PM IST
ఆర్టికల్ 370 చరిత్రలో కలిసిపోయింది.. మళ్లీ రాదు: అమిత్‌షా

జమ్ముకశ్మీర్‌లో ఎన్నికలు జరగనున్న సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అక్కడ కిశ్త్‌వార్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కిశ్త్‌వార్‌లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ప్రసంగించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతామని చెప్పారు అమిత్‌షా. మరోసారి కనిపించనంత స్థాయిలో పాతిపెడతామని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో ఉగ్రవాదాన్ని పునరుద్ధరణకు ఎవ్వరూ సాహసించలేరని చెప్పారు. నేషనల్‌ కాన్ఫరెన్స్, కాంగ్రెస్‌ కలిసి జమ్ముకశ్మీర్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చెప్పారు.

ప్రధాని నరేంద్ర మోదీ పాలన ఉన్నంత వరకు ఉగ్రవాదాన్ని పునరుద్ధరించే ప్రయత్నం ఎవరూ చేయలేరని.. ఆ సాహసమే ఎవరూ చేయలేరని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అన్నారు. ఉగ్రవాదుల విడుదల గురించి నేషనల్‌ కాన్ఫరెన్స్‌, కాంగ్రెస్‌ల మేనిఫెస్టోలో పేర్కొంటున్నాయని అన్నారు. ఇది మోదీ ప్రభుత్వం.. జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని ఏ శక్తీ పునరుద్ధరించలేదంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇక జమ్ముకశ్మీర్‌లో రాబోయే ఎన్నికల్లో రెండు శక్తుల మధ్య ఉంటుందని అన్నారు. ఒకవైపు ఎన్‌సీ, పీడీపీ ఉంటే.. మరోవైపు భారతీయ జనతా పార్టీ ఉందన్నారు. తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఆర్టికల్ 370ని రద్దు చేస్తామంటూ ఎన్‌సీ-కాంగ్రెస్‌ చెబుతున్నాయన్నారు. కానీ.. వారు ప్రభుత్వాన్నే ఏర్పాటు చేయలేరని.. ఇక ఆర్టికల్‌ 370ని తీసుకురావడం అనేది వారి కలే అవుతుందన్నారు. ఆర్టికల్ 370 అనేది చరిత్రలో కలిసిపోయిందనీ.. అది తిరిగి రాదని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చెప్పారు.

కాగా.. జమ్ముకశ్మీర్‌లో సెప్టెంబర్‌ 18వ తేదీన తొలి విడత అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. మొత్తం 90 స్థానాలు ఉండగా.. దక్షిణ కశ్మీర్‌ అనంతనాగ్, పుల్వామా, షోపియాన్, కుల్గాం జిల్లాలోని 24 అసెంబ్లీ స్థానాలకు తొలి విడతలో ఎన్నికలు జరుగుతాయి. ఆ తర్వాత రెండో దశలో 26 స్థానాలు, మూడో దశలో 40 స్థానాలకు పోలింగ్ జరగనుంది.

Next Story