హర్యానాలో కాంగ్రెస్‌ మేనిఫెస్టో.. ప్రజలకు వరాల జల్లు

హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది.

By Srikanth Gundamalla  Published on  18 Sep 2024 11:44 AM GMT
హర్యానాలో కాంగ్రెస్‌ మేనిఫెస్టో.. ప్రజలకు వరాల జల్లు

హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది. ఈ మేనిఫెస్టో ద్వారా రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ వరాల జల్లు కురిపించింది. ఏడు గ్యారెంటీలతో మేనిఫెస్టోను విడుదల చేశారు పార్టీ నేతలు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత సహా కులగణన చేపడతామని కాంగ్రెస్ పార్టీ హర్యానా ఎన్నికల మేనిఫెస్టోలో హామీగా చేర్చింది. కాగా.. హర్యానాలో వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

కాంగ్రెస్ పార్టీ హర్యానాలో ‘సాత్‌ వాదే పక్కే ఇరాదే’ పేరుతో ఏడు గ్యారంటీలను విడుల చేసింది. హామీలను కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. మహిళా సాధికారత కింద 18 నుంచి 60 ఏళ్ల వయసు ఉన్న ప్రతి మహిళకు నెలకు రూ.2 వేలు ఇస్తామని చెప్పారు. అలాగే.. రూ.500కే గ్యాస్‌ సిలిండర్లను ఇస్తామని హామీ ఇచ్చారు. ఇక వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు నెలకు రూ.6 వేలు పెన్షన్ ఇస్తామని కాంగ్రెస్ తమ మేనిఫెస్టోలో పేర్కొంది. 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌, కుటుంబానికి రూ.25 లక్షల వరకు ఉచితంగా వైద్య చికిత్సను అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.

పేదలకు ఒక్కో కుటుంబానికి 100 చదరపు గజాల స్థలం ఇస్తామని చెప్పారు. జాగా ఉండి ఇంటి నిర్మాణం చేయాలనుకుంటే.. అలాంటి వారికి రూ.3.5 లక్షలు ఇస్తామని కాంగ్రెస్ తెలిపింది. కుల గణన కూడా నిర్వహిస్తామని కాంగ్రెస్‌ తన మేనిఫెస్టోలో వెల్లడించింది. కాగా, 90 స్థానాలున్న హర్యానా అసెంబ్లీకి అక్టోబర్‌ 5న ఎన్నికలు జరగనున్నాయి. అదే నెల 8వ తేదీన ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి.



Next Story