లైంగిక దాడి, అత్యాచారం కేసులో హాలీవుడ్‌ మాజీ సినీ నిర్మాత హార్వే వేయిన్‌స్టిన్‌కు ఎట్టకేలకు శిక్ష ఖరారైంది. కథానాయకలతో పాటు అనేక మంది సిబ్బందిపై లైంగిక దాడులకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వేయిన్‌స్టిన్‌కు 23 ఏళ్ల పాటు కారాగార శిక్ష విదిస్తూ మాన్‌హట్టన్‌ క్రిమినల్‌ కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. ‘మీ టూ’ ఉద్యమం విస్తృతమవడానికి నాంది పలికిన ఈ కేసులో ఆయనకు శిక్షాకాలాన్ని తగ్గించాలంటూ వేయిన్‌స్టీన్‌ తరఫు న్యాయవాది చేసిన అభ్యర్థనను మన్‌హాట్టన్‌ క్రిమినల్‌ న్యాయస్థానం మన్నించలేదు. మాజీ ప్రొడక్షన్‌ అసిస్టెంట్‌ మిమి హలేయీ, ఔత్సాహిక నటి జెస్సికా మాన్‌లపై వేయిన్‌స్టిన్‌ ను అత్యాచారానికి పాల్పడినట్లు తేలడంతో గత ఫిబ్రవరి 24న అతడిని దోషిగా ప్రకటిస్తూ ధర్మాసనం ఉత్తర్వులు వెలువరించింది.

Harvey weinstein MeToo case

ఒకప్పుడు హాలీవుడ్‌లో అత్యంత ప్రభావశీలురైన నిర్మాతల్లో వేయిన్‌స్టిన్‌ ఒకరు. గరిష్టంగా 29 ఏళ్ల వరకూ జైలు శిక్ష పడే అవకాశమున్న లైంగిక దాడుల నిరోధక చట్టంలోని వివిధ సెక్షన్ల కింద నమోదైన కేసుల్లో ఆయన విచారణ ఎదుర్కొన్నారు. తీర్పు వెలువరించే సమయంలో వేయిన్‌స్టిన్‌తో పాటు ఆయనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన ఆరుగురు మహిళలు కూడా కోర్టులో ఉన్నారు.

మరోసారి కేసు వివరాల్లోకి వెళితే.. తమతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ దాదాపు 80 మంది మహిళలు 2017లో ఆయనపై ఆరోపణలు చేశారు. ఐరన్‌మ్యాన్ 3, ‘ఎవెంజర్స్ ఎండ్ గేమ్’ తదితర చిత్రాల్లో నటించిన గ్వైనెత్ పాల్ట్రో, కిల్ బిల్ ఫేమ్ ఉమా తుర్మన్, సల్మా హాయేక్ వంటి ప్రముఖ నటీమణులే ప్రజల ముందుకు వచ్చి తమ కష్టాలను చెప్పుకున్నారు. వారిని చూసి చాలామంది హార్వే బాధితులు బయటకు వచ్చి అతనిపై లైంగిక ఆరోపణలు చేశారు. దీంతో హాలీవుడ్‌లో ‘మీటూ’ ఉద్యమం మొదలైంది. హార్వేపై పలు కేసులు నమోదు అయ్యాయి. అయితే తనపై వచ్చిన ఆరోపణలను హార్వే ఎప్పటికప్పుడు ఖండిస్తూనే వచ్చారు. కానీ 2018 మే నెలలో పోలీసులకు ఆయన లొంగిపోయాడు.

హార్వే నిర్మించిన పల్ప్ ఫిక్షన్, గుడ్ విల్ హంటింగ్, ది కింగ్స్ స్పీచ్ తదితర చిత్రాలకు ఆస్కార్ అవార్డులు లభించాయి. ఎన్ని అవార్డులొస్తే ఏమి లాభం మనిషి వ్యక్తిత్వం సరైనది కానప్పుడు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.