దటీజ్‌ హరీష్‌రావ్‌!.. ఏం చేశాడంటే?

తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు రూటే సఫరేటు. ప్రజల మనిషిగా, నిత్యం ప్రజల్లోనే ఉంటూ వారి సమస్యల పరిష్కారంలో కీలక భూమిక పోషిస్తుంటాడు. తన నియోజకవర్గం సిద్ధిపేటలో అయితే నిత్యం పర్యటనలు చేస్తూ.. అధికారులను హడలెత్తిస్తుంటాడు. తాజాగా సిద్ధిపేటలో సోమవారం మార్నింగ్‌ వాక్‌చేస్తూ పట్టణంలో పలు ప్రాంతాల్లో మంత్రి పర్యటించారు.

ఆదివారమే అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన మంత్రి హరీష్‌రావు రాకను చూసిన ప్రజలుసైతం ఆశ్చర్యపోయారు. చడీచప్పుడు లేకుండా తమ వీధుల్లోకి రావటంతో పరుగున మంత్రి వద్దకు చేరుకున్నారు. అనంతరం మంత్రి హరీష్‌రావు ఐదు మున్సిపల్‌ వార్డుల్లో కలియతిరుగుతూ స్థానికంగా ఉన్న సమస్యలను తెలుసుకున్నారు. ఈసందర్భంగా తడిపొడి చెత్తను వేరుచేయడంపై స్థానికులకు అవగాహనకల్పించారు. ప్రతీ ఒక్కరూ తడిపొడి చెత్తను వేరు చేయాలని, అలా చేయకుండా చెత్తను వేయవద్దని మంత్రి సూచించారు. ఇలా ప్రతిరోజూ చెత్తను వేరుచేసి ఇస్తే.. తెలంగాణలో కాలుష్యాన్ని తగ్గించడం కొంతమేరకైనా సాధ్యమవుతుందని అన్నారు.

ఇదిలాఉంటే పలువురికి సెల్‌ఫోన్‌లో వీడియోల ద్వారా తడిపొడి చెత్తను ఎలా వేరు చేస్తారో హరీష్‌రావు చూపించారు. నేరుగా ఆర్థికశాఖ మంత్రినే తమ ఇళ్ల ముందుకొచ్చి సూచనలు చేస్తుంటే స్థానికులు సరేసార్‌ .. సరేసార్‌ అంటూ బదులిచ్చారు. హరీష్‌రావుకు ఇలాంటి ఆకస్మిక పర్యటనలు చేయటం కొత్తేంకాదు. సిద్ధిపేట పట్టణంలోనూ, నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లోనూ పలుసార్లు ఆకస్మిక పర్యటనలు చేసి అక్కడి ప్రజలను ఆశ్చర్య చకితులను చేశారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *