ఇక స్క్రీన్ పై.. భజ్జి భల్లే..భల్లే..!

By రాణి  Published on  5 Feb 2020 10:37 AM GMT
ఇక స్క్రీన్ పై.. భజ్జి భల్లే..భల్లే..!

భారత క్రికెటర్ హర్భజన్ సింగ్.. మైదానంలో భారత జట్టుకు అందించిన విజయాలు ఎన్నో..!ఇక మైదానం వెలుపల కూడా వివాదాలు ఉన్నాయి. ప్రస్తుతం భారతజట్టు లో స్థానం కోల్పోయిన భజ్జి.. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు. అలాగే కామెంట్రేటర్ గా కూడా తనదైన స్టైల్ లో ప్రస్తుతం అలరిస్తూ ఉన్నాడు. అలాంటి భజ్జీ అతి త్వరలో వెండితెరపై ప్రత్యక్షమవనున్నాడు. భజ్జీ ఫ్రెండ్ షిప్ అనే తమిళ సినిమాలో నటించనున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, ప్రియాంక చోప్రాలు నటించిన 'ముజ్ సే షాదీ కరోగి' అనే సినిమాలో పదహారేళ్ళ క్రితం చిన్న కేమియో చేశాడు. ఇప్పుడు తొలి సారి ఫుల్ లెంగ్త్ రోల్ లో 'ఫ్రెండ్ షిప్' సినిమాలో భజ్జీ నటించనున్నాడు. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు డ్వెన్ బ్రావో ఓ తమిళ సినిమాలో నటించాడు. అలాగే పలు షోలలో కూడా సందడి చేశాడు.

హర్భజన్ సింగ్ క్రికెట్ ద్వారా దేశవ్యాప్తంగా ఎంతో పాపులారిటీ సాధించాడు.. అటువంటి వ్యక్తి సినిమాల్లో నటించడం ద్వారా ప్రేక్షకులు కూడా వారిని ఆదరించడానికి పెద్ద సమయం పట్టదని.. సినిమాకు కూడా మంచి హైప్ వచ్చే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ అనలిస్టులు చెబుతున్నారు. సచిన్ టెండూల్కర్ కూడా కెరీర్ ముగిశాక తన డాక్యుమెంటరీలో నటించడం ఒక చక్కటి ఉదాహరణ. అలాగే సురేష్ రైనా కూడా తన సింగింగ్ టాలెంట్ ను బయటపెట్టాడు. ఈ మధ్యనే సినిమాలో కూడా పాట పాడాడు. మీరాబాయి నాటౌట్ అనే సినిమాలో అనిల్ కుంబ్లే కొద్ది సేపు కనిపిస్తాడు. వసంతం సినిమాలో వి.వి.ఎస్.లక్ష్మణ్ కనిపిస్తాడు.

ఇలా క్రికెట్ కెరీర్ ముగిశాక లేదా కెరీర్ ముగింపు దశలో సినిమాల్లోకి వచ్చే వాళ్ళు కొంతమంది ఉండగా.. క్రికెట్ కెరీర్ లో బ్యాన్ ఎదుర్కొంటూనే సినిమాల్లో నటించిన వాళ్ళు ఉన్నారు. శ్రీశాంత్ ఎంత మంచి ఆటగాడో ప్రతి ఒక్కరికీ తెలిసిందే. వికెట్ పడినా, ఎవరికైనా సిక్స్ కొట్టినా తనదైన శైలిలో డాన్స్ స్టెప్స్ వేస్తూ అలరించేవాడు. గొప్ప ఫాస్ట్ బౌలర్ గా ఎదిగే అవకాశాలు ఉన్న సమయంలో ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ చేస్తూ దొరికిపోయాడంటూ ఆరోపణలు రావడంతో కొన్ని ఏళ్ల పాటూ క్రికెట్ కు దూరం అవ్వాల్సి వచ్చింది. ఇలాంటి తరుణంలో సినిమాల్లో నటించాడు శ్రీశాంత్. క్యాబరే అనే బాలీవుడ్ సినిమాలోనూ, ఒక తెలుగు సినిమాలోనూ కనిపించాడు. శ్రీశాంత్ సినిమా కెరీర్ ను కొనసాగించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అప్పట్లో అజయ్ జడేజా కూడా మ్యాచ్ ఫిక్సింగ్ లో ఇరుక్కున్నప్పుడు బాలీవుడ్ బాట పట్టాడు. ఇప్పుడు హర్భజన్ కెరీర్ దాదాపు ముగిసినట్లే.. క్రికెట్ లో అందరినీ అలరించినట్లే నటనలో కూడా మనల్ని అలరిస్తాడని ఆశిద్దాం

Next Story
Share it