అదే ధోని చివరి టోర్నీ.. ఆ మ్యాచే అతడికి చివరి మ్యాచ్..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 16 Jan 2020 2:49 PM GMTటీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోనికి తాజాగా ప్రకటించిన బీసీసీఐ వార్షిక కాంట్రాక్ట్ జాబితాలో చోటు దక్కలేదు. దీంతో ధోని కెరీర్ ముగిసినట్టేనని పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరం ఇంగ్లండ్ వేదికగా జరిగిన వరల్డ్‌కప్ అనంతరం ధోని మళ్లీ మైదానంలో కనపడలేదు. అలాగే రిటైర్మెంట్ కూడా ప్రకటించలేదు. దీంతో ధోని కెరీర్‌పై ఉత్కంఠ మొదలైంది.
అయితే.. బీసీసీఐ మాత్రం పొమ్మనలేక పొగపెట్టినట్లు.. ధోనిని కాంట్రాక్ట్ జాబితా నుంచి తొలగించి సాగనంపేందుకు చర్యలు చేపట్టిందని మాజీలు అంటున్నారు. ఇదే అభిప్రాయాన్ని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కూడా వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా హర్భజన్ మాట్లాడుతూ.. బీసీసీఐ కాంట్రాక్ట్ జాబితా చూశాక ధోని చివరి మ్యాచ్ ఆడేశాడా అనే అనుమానం కలిగిందని అన్నాడు.
అంతేకాక.. వరల్డ్‌కప్ తర్వాత ధోని మళ్లీ గ్రౌండ్‌లోకి అడుగుపెట్టలేదని.. టీమిండియా సెలక్షన్స్‌కు అందుబాటులో లేడని పేర్కొన్నాడు. అయితే ఐపీఎల్‌లో మాత్రం ధోని నుండి అద్భుతమైన ఆటను చూస్తాం. ధోని అడే ప్రతీ మ్యాచ్‌లో ఆటగాడిగా వంద శాతం ప్రూవ్ చేసుకోవాలనుకుంటాడని భజ్జీ అన్నాడు.
ఒకవేళ ధోని ఐపీఎల్‌లో రాణించిని.. ఇండియా తరుపున ఆడతాడనే నమ్మకం లేదని.. నాకు తెలిసి 2019 ఇంగ్లాండ్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్ అతడి చివరి టోర్నీ అని. సెమీఫైనల్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచే బహుశా అతడి చివరి మ్యాచ్’ అంటూ హర్భజన్ పేర్కొన్నాడు. ఇదిలావుంటే.. బీసీసీఐ నిర్ణయం పట్ల ధోని ఎలా స్పందిస్తాడోనని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఏదేమైనా మూడు మెగా టైటిళ్లు అందించిన ధోని పట్ల బీసీసీఐ వ్యవహరించిన తీరును అందరూ వ్యతిరేకిస్తున్నారు.