ఇద్దరు తలారీలు.. నిర్భయ దోషుల ఉరి కోసమేనా ?

By రాణి  Published on  12 Dec 2019 1:15 PM GMT
ఇద్దరు తలారీలు.. నిర్భయ దోషుల ఉరి కోసమేనా ?

''మాకు అవసరమైనపుడు ఇద్దరు తలారీలను పంపించండి'' అని తిహార్ జైలు అధికారులు యూపీ జైళ్ల శాఖకు ఫ్యాక్స్ పంపారు. ఈ విషయాన్ని యూపీ జైళ్ల శాఖ అదనపు డీజీ ఆనంద్ కుమార్ వెల్లడించారు. అవసరమైనపుడు ఇద్దరు తలారీలను పంపించమని రాశారు కానీ దోషులెవరు ? ఉరి ఎప్పుడు ? వంటి వివరాలేమీ అందులో లేవని ఆయన తెలిపారు. ఢిల్లీలోని తీహార్ జైలుకి అధికారికంగా తలారి లేరన్నారు. అయితే ఆ ఇద్దరు తలారీలు నిర్భయ దోషుల ఉరి కోసమేనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. యూపీ జైళ్ల శాఖ పరిధిలో లఖ్ నవూలో ఒకరు, మీరట్ లో ఒకరు చొప్పున ఇద్దరు తలారీలు ఉన్నారు. మరోవైపు నిర్భయ దోషులను ఉరితీసేందుకు తమకు అవకాశం కల్పించాలని కోరుతూ 15 మంది యూపీ జైలుకు లేఖలు రాశారు. ఈ లేఖల్లో రెండు విదేశాల నుంచి వచ్చాయట. ఢిల్లీ, గురుగ్రామ్, ముంబై, ఛత్తీస్ గఢ్, కేరళ, తమిళనాడు నుంచి లేఖలు వచ్చినట్లు జైలు అధికారులు తెలిపారు.

తలారి వృత్తి కూడా వంశపారంపర్యంగా వస్తున్నదే. ఉత్తరప్రదేశ్‌లో మీరట్ జైల్లో పవన్ అనే తలారి అధికారికంగా ఈ వృత్తిలో ఉన్నారు. ప్రస్తుతం 56 ఏళ్ల వయసున్న పవన్ నెలకి రూ. 3,000 జీతంతో పనిచేస్తున్నారు. ఆయన తండ్రి కల్లు, తాత లక్ష్మణ్ కూడా తలారీలే కావటంతో చిన్నప్పటి నుంచీ ఉరిశిక్ష అంటే ఏమిటి, దానిని అమలు చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది పవన్‌కి బాగా తెలుసు. పవన్ తాత లక్ష్మణ్.. ఇందిరాగాంధీ హంతకుల్ని ఉరితీశారు. పవన్ తండ్రి కల్లు కరడుగట్టిన నేరస్తులు రంగా, బిల్లాలను ఉరితీశారు. తీహార్ జైలు నుంచి అధికారికంగా పవన్‌కి ఎలాంటి ఆదేశాలు రాకపోయినా.. నిర్భయ నిందితుల్ని ఉరితీసేందుకు ఆయన సిద్ధమవుతున్నారు.

Next Story