కన్నె పిల్లలోయ్.. కన్ను కొట్టేరోయ్..

By అంజి  Published on  17 Feb 2020 10:59 AM GMT
కన్నె పిల్లలోయ్.. కన్ను కొట్టేరోయ్..

ఈ మధ్యకాలంలో ఇజ్రాయిల్ సరిహద్దుల్లో కాపలా కాసే సైనికుల సెల్ ఫోన్లు ఉన్నట్టుండి పాడైపోతున్నాయి. వైరస్, మాల్ వేర్ కుప్పలు తెప్పలుగా గూడుకట్టుకుని ఫోన్లు పనికిరాకుండా చేసేస్తున్నాయి. ఇదేమిట్రా అని ఇజ్రాయిలీ అధికారులు దర్యాప్తు మొదలుపెడితే వాళ్లు కళ్లు తేలేశారట. ఇజ్రాయిలీ సైనికులందరి ఫోన్లలోనూ అందగత్తెలు, అన్నుల మిన్నలు ఫ్రెండ్స్ గా మహా రోమాంటిక్ మెసీజీలు పంపుతున్నారట. మగపురుషులు దెబ్బకి పడిపోయి, ఆ ఫేస్ బుక్ బ్యూటీలతో చాటింగ్ లు చేస్తున్నారట. ఈ క్రమంలోనే వైరస్, మాల్ వేర్ సైనికుల ఫోన్లలోకి వచ్చేస్తున్నాయి. ఇది అలా అలా వ్యాపించి మొత్తం ఇజ్రాయిలీ సైనిక సమాచార వ్యవస్థనే కుప్పకూల్చడానికి సిద్ధంగా ఉందట.

అది ఇజ్రాయిల్ కాబట్టి ప్రమాదాన్ని త్వరలో గుర్తించింది. తగిన చర్యలు తీసుకుంది. దాంతో భారీ కుట్ర విఫలమైంది. హమాస్ ఉగ్రవాదులు అందమైన అమ్మాయిల పేరిట ఫేస్ బుక్ ఎకౌంట్లు ఓపెన్ చేయించి ఇజ్రాయిలీ అబ్బాయిలకు గాలం వేస్తున్నారట. వాట్సప్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్, టెలిగ్రాం వంటి డిజిటల్ ప్లాట్ ఫారంలను ఉపయోగించి “ప్రేమ” పోటు పొడుస్తున్నారట.

తాము కొత్తగా ఇజ్రాయిల్ కి వచ్చామని, అందుకే తమ భాష అంత ధారాళంగా లేదని, తమకు ఫోన్లో మాట్లాడాలంటే కాస్త వినికిడి సమస్యలున్నయని, అందుకే చాట్ చేస్తున్నామని వారు జవాన్లను నమ్మించేశారు. పైగా వారి డీపీలు, ఇతర ఫోటోలను రివర్స్ ట్రాకింగ్ చేయడమూ చాలా కష్టమట. అంత తెలివిగా వారు ఆన్ లైన్ ఐడెంటిటీలను తయారు చేసుకున్నారు.

కాస్త నమ్మకం కలిగాక వారు సైనికులను ఏవో కొన్ని స్నాప్ చాట్ వంటి యాప్ లను డౌన్ లోడ్ చేసుకొమ్మని కోరుతున్నారట. అప్పటికే ప్రేమ కోసమై వలలో పడిన పసివాళ్లు పాపం చెప్పింది చేస్తున్నారట. దీంతో గ్రిక్సీ యాప్, జాటు యాప్, కాచ్ ఎండ్ సీ యాప్ వంటి మాల్ వేర్లు జవాన్ల కంప్యూటర్లలోకి వచ్చేస్తున్నాయి. ఇవన్నీ హమాస్ డేటా సెంటర్లలోకి వెళ్తున్నాయి. ఇజ్రాయిలీ వివరాలన్నీ హమాస్ గుప్పెట్లోకి వెళ్తున్నాయి.

ఇప్పుడు ఇజ్రాయిల్ సైనికాధికారులు మేల్కొనడంతో ఈ కుట్ర బయటపడింది. నిజానికి ఇలాంటి కుట్రే మన జవాన్ల పైనా జరిగింది. అక్కడ విలన్ పాకిస్తాన్. పాకిస్తాన్ మన న్యూస్ పేపర్లలో మాట్రిమోనియల్ యాడ్స్ (పెళ్లి ప్రకటనలు) ఇచ్చి అంమైన సైనికులను ఆకర్షించేవారు. మనవాళ్లు తెలియకుండానే తమ వివరాలను ఆ యాడ్ వేయంచిన వారికి పంపేవారు. దాంతో పాటు తమ ఫోన్ నంబర్లను కూడా పంపేవారు. ఆ ఫోన్ సాయంతో హ్యాకింగ్ చేసి వివరాలు సంపాదించడం, అందమైన అమ్మాయిలను తేనె వలలుగా మార్చి, వలపు జైలులో బందీ చేసేవారు. ఆ తరువాత మనవాళ్ల వీక్ నెస్ ను ఉపయోగించుకుని వారు మన రహస్య సమాచారాన్ని గ్రహించేవారు. అందుకే మన సైన్యం కూడా ఫేస్ బుక్, వాట్సప్, సోషల్ మీడియా ల విషయంలో పూర్తిగా జాగ్రత్తగా ఉండమని సైనికులకు హెచ్చరికలు జారీ చేసింది.

Next Story