ముగిసిన విచారణ.. తుది తీర్పు ఎప్పుడంటే..

By సుభాష్  Published on  17 Jan 2020 11:06 AM GMT
ముగిసిన విచారణ.. తుది తీర్పు ఎప్పుడంటే..

తెలంగాణలో యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మల రామారం మండలం, హాజీపూర్‌ గ్రామంలో సంచలనం సృష్టించిన హత్య కేసుల్లో ఎట్టకేలకు విచారణ ముగిసింది. గ్రామానికి చెందిన ముగ్గురు బాలికల హత్యాచారం, హత్య కేసులో పోక్సో కోర్టు ఈనెల 27న తుది తీర్పు వెలువరించనుంది. నిందితుడు శ్రీనివాస్‌ రెడ్డిపై ముగ్గురు బాలికలపై అత్యాచారం, హత్య కేసులు నమోదు కాగా, ఈనెల 8 నాటికి కేసుకు సంబంధించిన వాదనలు పూర్తయ్యాయి. మరో రెండు హత్య కేసుల్లో వాదనలు వినకుండానే తీర్పు వెల్లడించనున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు.

గత ఆగస్టు నెలలో బొమ్మల రామారం పోలీసుస్టేషన్‌ పరిధిలో జరిగిన బాలికల అత్యాచారం, హత్య ఘటనలపై పోలీసులు జరిపిన విచారణలో విస్తూపోయే నిజాలు బయటపడ్డాయి. బాలికలపై అత్యాచారం జరిపి అనంతరం హత్య చేసి ఓ పాడుబడ్డ బావిలో దాచినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో నిందితుడిగా తేలిన శ్రీనివాస్‌ రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేసి ఇన్ని రోజులు విచారణ కొనసాగించారు. నిందితుడికి తక్షణమే కఠిన శిక్ష వేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. కోపంతో రగిలిపోయిన గ్రామస్తులు నిందితుడి ఇంటికి నిప్పంటించారు. ఈ దారుణం జరిగిన 60 రోజుల్లోనే పోలీసులు చార్జిషీట్‌ దాఖలు చేశారు. మొత్తం 300 మందికి పైగా సాక్షులను పేర్కొన్నారు. కామాంధుడు శ్రీనివాస్‌ రెడ్డికి బలైన ముగ్గురు బాలికల పోస్టుమార్టం నివేదిక, డీఎన్‌ఏ రిపోర్టులు, స్థానికంగా లభించిన ఆధారాలను రిపోర్టులో పొందుపర్చారు. ఇటీవలనిందితుడు శ్రీనివాస్‌ రెడ్డి వాంగ్మూలాన్ని సైతం కోర్టులో రికార్డు చేశారు.

Next Story
Share it