హాజీపూర్ హత్యల కేసు.. తీర్పుకు సమయం ఆసన్నమైంది..!
By Newsmeter.Network Published on 26 Dec 2019 12:00 PM IST
నల్గొండ: హాజీపూర్ సీరియల్ కిల్లర్ శ్రీనివాస్‌రెడ్డి పోలీసులు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో ప్రవేశపెట్టారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య నిందితుడు శ్రీనివాస్‌రెడ్డిని పోలీసులు కోర్టుకు తీసుకువచ్చారు. కోర్టులో శ్రీనివాస్‌రెడ్డి స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి అత్యచారాలు, 3 హత్యలు చేశాడు. ఇప్పటికే హాజీపూర్ హత్యల కేసుపై వాదనలు ముగిసాయి. ఇవాళ 313 సెక్షన్ కింద నిందితుడి అభిప్రాయాన్ని చెప్పేందుకు నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డిని పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. ఈ కేసులో ఇప్పటికే 300 మంది సాక్షుల వాంగ్మూలాలను ఫాస్ట్‌ట్రాక్ కోర్టు రికార్డు చేసింది. ఈ విచారణ రెండు నెలల పాటు సాగింది. హత్యలకు సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్టు, సెల్‌టవర్ లొకేషన్‌తో పాటు, కీలక ఆధారాలను పోలీసులు ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు అందజేశారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. నల్గొండ ఫాస్ట్‌ట్రాక్ అక్టోబర్ 14 నుంచి విచారణ చేపట్టింది.
మైనర్ బాలికలు శ్రావణి, కల్పన, మనీషాలను నిందితుడు శ్రీనివాస్ రెడ్డి దారుణంగా హతమార్చాడు. 2015లో ఓ మహిళ పట్ల నిందితుడు అసభ్యంగా ప్రవర్తించాడు. నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి ఫేస్‌బుక్ ఖాతాలో 373 మంది ఫ్రెండ్స్ లిస్ట్ ఉంది. 2017లో కర్నూలులో నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డిపై కేసు నమోదైందని, నిందుతుడిది సైకో మనస్తత్వమని సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో హాజీపూర్‌లోని వ్యవసాయ బావిలో పోలీసులు జరిపిన తవ్వకాల్లో కొన్ని ఎముకలను గుర్తించారు. ఈ ఘటనలు జరిగిన సమయంలో యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలంలోని గ్రామాలు నిందితుడు శ్రీనివాస్‌రెడ్డిని తల్చుకొని వణికిపోయాయి. ఇన్నాళ్లు తమ మధ్యే ఉంటూ ఇంత దారుణాలకు ఒడిగట్టాడని ఆ పల్లె ప్రజలు తెలుసుకోలేకపోయారు. హాజీపూర్ గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో బస్సులు, ప్రైవేట్ వాహనాలు తక్కువగా నడిచేవి. దీన్నే అదనుగా భావించిన శ్రీనివాస్‌రెడ్డి.. లిఫ్ట్ పేరుతో అమ్మాయిలను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం, ఆ తర్వాత హత్య చేసేవాడు. కాగా నిందితుడు శ్రీనివాస్‌రెడ్డిని ఉరితీయాలంటూ హాజీపూర్ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.