లైంగిక వాంఛ కోసం హత్యలు.. నిందితుడికి ఉరిశిక్ష సబబే..!

By అంజి  Published on  6 Jan 2020 2:23 PM GMT
లైంగిక వాంఛ కోసం హత్యలు.. నిందితుడికి ఉరిశిక్ష సబబే..!

నల్గొండ: హాజీపూర్‌ వరుస హత్యల కేసులో విచారణ రేపటికి వాయిదా పడింది. ఫోక్సో స్పెషల్‌ కోర్టులో శ్రావణి కేసులో ప్రాసిక్యూషన్‌ వాదనలు ముగిశాయి. నిందితుడు మర్రి శ్రీనివాసరెడ్డి అన్ని విధాలుగా ఉరిశిక్షకు అర్హుడని.. జాలి, దయ చూపాల్సిన అవసరం లేదని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ తన వాదన కొనసాగించారు. ఈ కేసును అరుదైన కేసుల్లో అరుదైనదిగా భావించాలని కోర్టుకు తెలిపారు. అత్యంత పాశవికంగా, అభం శుభం తెలియని బాలికలను అత్యాచారాం చేసి హత్య చేశాడని పేర్కొన్నారు. ఇటువంటి కేసుల్లో ఉరిశిక్షనే సరైనదని సుప్రీంకోర్టు పలు కేసుల్లో సృష్టిం చేసిందన్నారు.

సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఇది అరుదైన కేసుగా పరిణగించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. నిందితుడికి నేర చరిత్ర ఉందని, గతంలోనూ ఒంటరి మహిళలపై లైంగిక దాడికి పాల్పడినట్టు రుజువైందని ప్రాసిక్యూటర్‌ తెలిపారు. కర్నూలులో ఒక మహిళపై లైంగిక వాంఛ తీర్చుకొని హత్య చేశాడని కోర్టుకు వివరించారు. కేవలం తన వాంఛ తీర్చుకోవడం కోసం హత్యలు చేస్తున్నాడని.. ఇటువంటి వ్యక్తి సమాజంలో ఉండడం శ్రేయస్కరం కాదని కోర్టుకు ప్రాసిక్యూటర్‌ విన్నవించుకున్నాడు. ఇది కేవలం ఒక కేసుగా చూడకూడదని, సమాజానికి పట్టిన రుగ్మతగా పరిగణించాలన్నారు.

సహజ న్యాయ ప్రకారం చూసినా, లాజికల్‌గా చూసినా నిందితుడికి ఉరిశిక్ష సబబేనని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండాలంటే ఉరిశిక్ష వేయాల్సిందేనని ప్రాసిక్యూటర్‌ తన వాదనలు వినిపించాడు. కాగా మిగతా విచారణ రేపు కొనసాగనుంది. రేపు మనీషా, కల్పనల కేసులో కూడా పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ తన వాదనలను వినిపించనున్నారు. అనంతరం మరుసటి రోజు డిఫెన్స్‌ తరపున నిందితుడి లాయర్‌ వాదనలు కొనసాగిస్తారు. ఈ నెల 20 లోగా హాజీపూర్‌ వరుస హత్యల కేసుపై తుది తీర్పు వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే సాక్ష్యుల వాంగ్మూలాలను, నిందితుడి వాంగ్మూలాలను కోర్టు రికార్డు చేసింది.

Next Story
Share it