26/11 ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారికి 11ఏళ్ల జైలు శిక్ష
By Newsmeter.Network
26/11 ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి హఫీజ్ సయీద్‌కు పాకిస్థాన్ కోర్టు 11 ఏళ్లు జైలు శిక్ష విధించింది. లాహోర్‌లోని యాంటీ టెర్రరిస్ట్ కోర్టు సయీద్‌కు ఈ మేరకు శిక్ష విధించింది. పలు ఉగ్రవాద సంస్థలకు జమాత్ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ ఆర్థిక వనరులు సమకూర్చారనే అభియోగాలు నిజమని తేలడంతో కోర్టు రెండు కేసుల్లో ఆయనను దోషిగా తేల్చి శిక్షను ఖరారు చేసింది.
ఒక్కో కేసుకు ఐదున్నరేళ్ల చొప్పున మొత్తం 11 ఏళ్లు జైలుశిక్ష విధిస్తున్నట్లు న్యాయస్థానం బుధవారం తీర్పు వెలువరించింది. జైలు శిక్షతో పాటు ఒక్కో కేసులో రూ.15వేలు చొప్పున జరిమానా విధించింది. ఉగ్రవాదులకు నిధుల సహకారం ఆపాలంటూ అంతర్జాతీయంగా పాకిస్థాన్‌పై ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో హఫీజ్ సయీద్‌పై ఆ దేశం ఈ చర్యలకు పూనుకున్నట్లు తెలుస్తోంది.
ఉగ్రవాదులకు ఆర్థిక సహకారం, మనీలాండరింగ్ సహా మొత్తం 23 కేసుల్లో హఫీజ్ సయీద్‌ను నిందితుడిగా పేర్కొంటూ అతడిపై పాకిస్థాన్‌లోని పంజాబ్ కౌంటర్ టెర్రరిజమ్ డిపార్ట్‌మెంట్ అభియోగాలు దాఖలు చేసింది. 26/11 ముంబై దాడుల్లో మొత్తం 166 మంది మృతి చెందారు.