గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం

By సుభాష్  Published on  3 Oct 2020 3:16 AM GMT
గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం

గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. యార్లపాడు మండలం తిమ్మాపురం వద్ద 16వ జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో మహిళ మృతి చెందింది. ప్రకాశం జిల్లా వలేటివారిపాలెం మండలంలోని ప్రసిద్ది పుణ్యక్షేత్రమైన శ్రీమాల్యాద్రి లక్ష్మీ నరసింహాస్వామి దేవాలయంలో అన్నదానం రవికుమార్‌ (47) గత కొంత కాలంగా వేదపండితులుగా పని చేస్తున్నారు. గుంటూరు నగరం కంకరగుంట ప్రాంతంలో నివాసం ఉంటున్న రవికుమార్‌, శనివారం మాత్రమే దర్శనం ఉండే ఈ దేవాలయానికి ప్రతి శుక్రవారం బైక్‌పై వెళ్లి వస్తుంటారు.

ఈ క్రమంలో గుంటూరు నుంచి మాలకొండ వెళ్తుండగా, మరో ద్విచక్ర వాహనంపై ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం మక్కెన వారిపాలెం గ్రామానికి చెందిన నంబూరి నాగరాజు (33), అతని భార్య కల్యాణి, అక్క కూతురు శ్రావణి విజయవాడ నుంచి గ్రామానికి వస్తున్నారు. ఒంగోలుకు చెందిన శివకృష్ణ కారులో విజయవాడ నుంచి వస్తున్నారు.

దీంతో జాతీయ రహదారి యార్లపాడు మండలం తిమ్మాపురం వద్ద కారు టైరు పగిలిపోయి అదుపు తప్పడంతో ముందు వెళ్తున్న రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వేద పండితుడు రవికుమార్‌, నాగరాజులు అక్కడికక్కడే మరణించారు. తీవ్రంగా గాయపడిన కల్యాణి, శ్రావణిలను గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చిలకలూరిపేట సీఐ సుబ్బారావు తెలిపారు.

Next Story
Share it