మూడేళ్ల కిందట మిస్సయిన తుపాకుల కేసులో సంచలన నిర్ణయం

By సుభాష్  Published on  19 March 2020 9:39 AM GMT
మూడేళ్ల కిందట మిస్సయిన తుపాకుల కేసులో సంచలన నిర్ణయం

2017 జూలైలో తెలంగాణలోని హుస్నాబాద్ పోలీసుస్టేషన్‌లో ఉన్నట్టుండి రెండు తుపాకులు మాయమయ్యాయి. నాడు మిస్సయిన రెండు తుపాకుల కేసు దాదాపు మూడు సంవత్సరాల తర్వాత మళ్లీ వెలుగులోకి వచ్చింది. దీంతో అంతా మర్చిపోయారనుకున్న సమయంలో పోలీసు ఉన్నతాధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తుపాకులు మిస్సయిన ఘటనకు బాధ్యులను చేస్తూ సీఐతో పాటు ఐదుగురిని సస్పెండ్‌ చేశారు.

వివరాల్లోకి వెళితే.. 2017 జూలైలో హుస్నాబాద్‌ పోలీసు స్టేషన్‌ ఒక ఏకే-47తోపాటు మరో కార్బైన్‌ గన్‌ మాయమయ్యాయి. తాజాగా.. ఆ సమయంలో ఎస్సైగా పని చేసి ప్రస్తుతం సీఐడీ సీఐగా పని చేస్తున్న సంజయ్‌తో పాటు అప్పటి కానిస్టేబుళ్లు మణేమ్మ, మనోజ్‌, సంపత్‌, అశోక్‌లను సస్పెండ్‌ చేస్తూ పోలీసు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు

తుపాకుల విషయం ఎలా వెలుగులోకి వచ్చిందంటే..

కాగా, అక్కన్నపేట మండల కేంద్రంలో ఓ ప్రహరీగోడ విషయంలో గత నెలలో ఘర్షణ జరిగింది. ఇదే గ్రామానికి చెందిన సదానందం అనే వ్యక్తి తన ప్రత్యర్థులపై ఏకే-47తో కాల్పులు జరిపాడు. దీంతో మిస్సయిన తుపాకుల విషయం వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న పోలీసులు సదానందాన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. సదానందం తానే స్వయంగా పోలీసుస్టేషన్‌ నుంచి రెండు గన్స్‌ తీసుకెళ్లినట్లు అంగీకరించాడు. కాగా, అక్కడ విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగానే తుపాకులు చోరీ జరిగినట్లు గుర్తించి వారిపై చర్యలు తీసుకున్నారు.

Next Story