మస్కట్‌లో తెలంగాణ వాసుల నరకం.. సరైన తిండి దొరకని వైనం..!
By సుభాష్ Published on 13 July 2020 6:56 AM GMTఉన్న ఊరిలో ఉపాధి లేదు.. సొంత రాష్ట్రంలో ఉద్యోగం లేదు. చేసుకునేందుకు పనులు లేక, సరైన జీతాలు లేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో జీవనపోరాటంలో గట్టెక్కేందుకు గల్ఫ్ దేశాలకు వెళ్లిన తెలుగు ప్రజల పరిస్థితి దారుణంగా ఉంది. తల్లిదండ్రులను, కట్టుకున్న భార్యను, కన్న పిల్లలను సైతం వదిలేసి కనరాని దేశాలకు వెళ్లి నరకయాతన పడుతున్నారు. బతుకుదెరువు కోసం విదేశాలకు వెళ్లిన తెలుగోడి పరిస్థితి దయనీయంగా మారింది. దేశం కాని దేశంలో దుర్భర పరిస్థితులను అనుభవించక తప్పడం లేదు. అక్కడి కంపెనీల నిర్లక్ష్యం, తెలుగువాళ్లపై చిన్న చూపు కారణంగా వారి జీవితాలు దర్భరంగా మారాయి. ఒకవైపు ఏజెంట్ల మోసాలు, మరో వైపు మస్కట్‌లో పని చేస్తున్న తెలుగు వాళ్లకు జీతాలు సరిగ్గా ఇవ్వక ఇబ్బందులు పెడుతుండటంతో చిల్లిగవ్వ కూడా ఆదాయం లేక గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు తెలంగాణ వాసులు.
తాజాగా మస్కట్‌లో భారత్‌కు చెందిన 40వేలకుపైగా బతుకుదెరువు కోసం పలు కంపెనీలలో పని కుదుర్చుకుని ఉంటున్నట్లు తెలుస్తోంది. కరోనా మహమ్మారి కారణంగా వారి బతుకులు మరింత చతికిలాపడిపోయాయి. ఒక వైపు ఏజెంట్ల మోసాలు..మరో వైపు మస్కట్‌లో ఉన్న కంపెనీలు ప్రవర్తించే తీరు మనోళ్లకు కన్నీళ్తు తెప్పిస్తున్నాయి.
గల్ఫ్ లో ఇప్పటికే పలు కంపెనీలు మూతపడగా, మరికొన్ని కంపెనీలు కార్మికులతో పనులు చేయించుకుంటూ జీతాలు ఇవ్వకుండా ,తిండి సరిగ్గాపెట్టకుండా నరకం చూపిస్తున్నాయనే ఆరోపణలున్నాయి. అంతేకాదు తమకు జీతాలు సరిగ్గా ఇవ్వాలని, ఇచ్చే జీతాల్లో కోతలు విధించరాదని అక్కడున్న తెలుగువాళ్లుతో పాటు భారత్‌లోని ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఓ కంపెనీ ముందు గత వారం రోజులుగా ఆందోళన చేస్తున్నారు. అయితే వాళ్లను ప్రశ్నించినందుకు తెలుగువాళ్లపై అక్కడి కంపెనీ యాజమాన్యం నరకం చూపించింది. కొందరి కార్మికులను సైతం చితకబాదినట్లు అక్కడి తెలుగువాళ్ల నుంచి సమాచారం. ఉంటే ఉండండి..లేకపోతే వెళ్లిపోండి.. అంటూ తీవ్రస్థాయిలో ఆక్రోశం వెల్లగక్కినట్లు అక్కడున్న తెలుగు ప్రజలు సోషల్ మీడియా ద్వారా తమ గోడును వెళ్లగక్కుతున్నారు. భారత ప్రభుత్వం స్పందించి తమను ఇక్కడి నుంచి రప్పించాలని వేడుకుంటున్నారు.
ఒకే కంపెనీలో తెలంగాణ నుంచి 3వేల మంది
కాగా, మస్కట్‌లో ఉన్న అళ్తురి (అంతస్మి) కంపెనీలో తెలంగాణ నుంచి వలస వెళ్లిన వారు చాలా మంది ఉన్నారు. బతుకు దెరువు కోసం వెళ్లిన దాదాపు 3వేలకుపైగా కార్మికులు ఆ అళ్తురి కంపెనీలో పని చేస్తున్నారు. ఆ కంపెనీలో నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్ తదితర జిల్లాలకు చెందిన వారు ఎక్కువగా ఉన్నారు. అయితే సరైన జీతాలు లేక, కడుపు నిండి తిండి దొరక్కపోవడంతో తమను ఇంటికి పంపించాలని కోరుతున్నా.. సదరు కంపెనీ స్పందించకపోవడంతో గత వారం రోజులుగా తెలుగువాళ్లు ఆందోళన చేస్తున్నారు. దీంతో ఈ ఆందోళనలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కార్మికులపై కంపెనీ యాజమాన్యం చితకబాదినట్లు అక్కడి నుంచి తెలుగువాళ్లు ఫోన్ ద్వారా సమాచారం అందించారు.
మస్కట్‌లో నరకం చూపిస్తున్నారు: దొడ్లె రమేష్, కామారెడ్డి జిల్లా వాసి
కరోనా మహమ్మారి కారణంగా జీతాలు ఇవ్వకుండా సరైన తండి లేక నానా అవస్థలకు గురవుతున్నామని మస్కట్‌లోని అళ్తురి కంపెనీలో పని చేస్తున్న కామారెడ్డి జిల్లా, బాన్సువాడ మండలం, కోనాపూర్ గ్రామానికి చెందిన దొడ్లె రమేష్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు సరైన జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని కన్నీరు మున్నీరవుతున్నాడు. చేసిన పనులకు జీతాలు ఇవ్వమంటే ఇవ్వకుండా కరోనా సాకుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అంతేకాదు సరైన తిండి కూడా పెట్టడం లేదు. ఇక్కడ పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. కన్నవాళ్లను, భార్య, పిల్లలను వదిలేసి కనరాని దేశానికి వస్తే ఇక్కడ పరిస్థితి దారుణంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం స్పందించి తమను ఇక్కడి నుంచి రప్పించాలి. లేకపోతే మా పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశం ఉంది. దాదాపు వారం రోజుల నుంచి ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నాం. ఎవరు ఎటువైపు నుంచి వచ్చి కొడతారోనని భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.. అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
వారం రోజులుగా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నాం: జగన్, కామారెడ్డి జిల్లా వాసి
వారం రోజులుగా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నాం. ఇక్కడి కంపెనీ వాళ్లు తమపై దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఎటువైపు నుంచి ఎవరు వచ్చి తమపై దాడి చేస్తారోననే భయంతో ఉంటున్నాం. తెలంగాణ ప్రభుత్వం స్పందించి తమను ఇక్కడికి రప్పించాలి.
గంగాధర్, జగిత్యాల జిల్లా వాసి
మస్కట్‌లో తీవ్ర ఇబ్బందులతో బతుకుతున్నాము. సరైన తిండి కూడా ఉండటంలేదు. కరోనా సాకుతో తమకు జీతాలు కూడా ఇవ్వడం లేదు. తెలంగాణ ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలి. లేకపోతే కన్నవాళ్లను సైతం వదిలి ఇక్కడికి వచ్చాము. తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాము.