పరిస్థితులు అలాంటివి: అమితాబ్, ఆయుష్మాన్ సినిమానే ఆన్ లైన్ లో విడుదల చేసేస్తున్నారు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  14 May 2020 3:33 PM GMT
పరిస్థితులు అలాంటివి: అమితాబ్, ఆయుష్మాన్ సినిమానే ఆన్ లైన్ లో విడుదల చేసేస్తున్నారు

లాక్ డౌన్ పూర్తిగా ఎప్పుడు ఎత్తివేస్తారో తెలీదు.. సినిమా హాళ్లను నడుపుకోడానికి ఎప్పుడు పర్మిషన్ ఇస్తారో తెలీదు. దీంతో రిలీజ్ కు వేచి ఉన్న సినిమాల నిర్మాతలు డైరెక్ట్ గా స్ట్రీమింగ్ యాప్స్ లో తమ సినిమాలను విడుదల చేయాలని అనుకుంటూ ఉన్నారు. ఇప్పటి వరకూ కొన్ని సినిమాలు రిలీజ్ అవ్వగా.. ఓ పెద్ద సినిమాను అతి త్వరలో విడుదల చేయబోతున్నారు.

సూర్జిత్ సర్కార్ తెరకెక్కించిన 'గులాబో.. సితాబో..' సినిమాను డైరెక్ట్ గా అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయబోతున్నారు. డైరెక్ట్ గా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో విడుదల అవుతున్న బాలీవుడ్‌ చిత్రం ఇదేనని అంటున్నారు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, ఆయుష్మాన్ ఖురానాలు కీలక పాత్రలు పోషించారు. లాక్ డౌన్ కారణంగా బాలీవుడ్ తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే.. దీంతో కొందరు నిర్మాతలు చేసేదేమి లేక డైరెక్ట్ గా ఓటీటీ సైట్స్ లో విడుదల చేస్తున్నారు.

అమెజాన్ ప్రైమ్ వీడియో మొత్తం 200 దేశాల్లో ఈ సినిమాను ప్రీమియర్ వేయనుంది. జూన్ 12, 2020న అమెజాన్ ప్రైమ్ లో సినిమా లభించనుంది. ఈ సినిమాను ఏప్రిల్ 17, 2020న విడుదల చేయాలని నిర్మాతలు భావించారు. కానీ లాక్ డౌన్ కారణంగా సినిమా వాయిదా పడింది. దీంతో నిర్మాతలు అమెజాన్ ప్రైమ్ వైపే మొగ్గుచూపారు. ఇర్ఫాన్ ఖాన్ నటించిన అంగ్రేజీ మీడియం సినిమానే బాలీవుడ్ లో థియేటర్లలో విడుదలైన ఆఖరి చిత్రం. ఆ తర్వాత లాక్ డౌన్ అమలు కావడంతో సినిమాలు విడుదలకు నోచుకోలేదు.

వరుస విజయాలతో దూసుకుపోతున్న ఆయుష్మాన్ ఖురానా నటించిన సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. కానీ థియేటర్ రిలీజ్ నోచుకోకుండా.. 'గులాబో.. సితాబో' కేవలం ఆన్ లైన్ కే పరిమితమైంది. ఇలా ఆన్ లైన్ లో డైరెక్ట్ గా రిలీజ్ అవ్వడం సరికొత్త చరిత్ర అని సూర్జిత్ సర్కార్ తెలిపారు. తన ఇన్నాళ్ల సినీ ప్రస్థానంలో డైరెక్ట్ గా ఆన్ లోన్ లో విడుదలవుతున్న తొలి చిత్రం ఇదని అమితాబ్ బచ్చన్ తన సోషల్ మీడియా అకౌంట్ లో పేర్కొన్నారు. మంచి కథా.. కథనాలు ఉన్న ఈ సినిమా ఫ్యామిలీతో కలిసి చూడొచ్చని చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమా తర్వాత పలు బాలీవుడ్ సినిమాలు డైరెక్ట్ గా పలు ఓటీటీ సైట్స్ లో విదులయ్యే అవకాశం ఉంది.

Next Story