ఆ అమ్మాయి.. విశ్వ పర్యావరణ పరిరక్షణ యాత్రకు చిన్న బ్రేక్

By Newsmeter.Network  Published on  15 Dec 2019 8:00 AM GMT
ఆ అమ్మాయి.. విశ్వ పర్యావరణ పరిరక్షణ యాత్రకు చిన్న బ్రేక్

టురిన్, ఇటలీ : పర్యావరణ పరిరక్షణకోసం అవిశ్రాంతంగా పోరాటం చేస్తున్న యువ పర్యావరణ కార్యకర్త, పర్యావరణ ప్రేమికురాలు గ్రేటా థంబర్గ్ తాను చేపట్టిన విశ్వయాత్రలో కొంతకాలంపాటు బ్రేక్ తీసుకోవాలనుకుంటోంది. కారు, రైలు, జల మార్గాల్లో తను ఈ యాత్రను చేపట్టింది. పర్యావరణానికి హాని కలిగిస్తున్న అనేక అంశాల్లో విమాన ప్రయాణంకూడా ఒకటి కనుక తాను విమానం ద్వారా ప్రయాణించబోనని ఆమె విశ్వయాత్రను ప్రారంభించడానికి ముందే స్పష్టం చేసింది.

టైమ్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ పొందిన 16 సంవత్సరాల ఈ యువ పర్యావరణ కార్యకర్త తాను చేస్తున్న యాత్రలో కొంతకాలంపాటు విశ్రాంతి అవసరమని భావిస్తోందిప్పుడు. ఉత్తర ఇటలీలోని టురిన్ నగరంలో వేలాదిమంది విద్యార్థులతో కలసి పర్యావరణ పరిరక్షణకోసం భారీ స్థాయి ప్రదర్శన నిర్వహించిన గ్రేటా కర్బన ఉద్గారాల నియంత్రణకు పూర్తి స్థాయిలో అన్ని దేశాలు, అన్ని ప్రభుత్వాలు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని పిలుపు ఇచ్చింది.

ప్రదర్శన పూర్తైన తర్వాత చేసిన ఒక ప్రకటనలో కొంతకాలంపాటు తాను విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నట్టుగా తెలిపిందీ యువ పర్యావరణ కార్యకర్త. స్పెయిన్ రాజధానిలో యు.ఎన్ క్లైమేట్ సమ్మిట్ తర్వాత అక్కడినుంచి నేరుగా గ్రేటా కారులో, రైల్లో ప్రయాణం చేసి ఇటలీలోని టురిన్ నగరానికి చేరుకుంది. అమెరికాలో భారీ స్థాయిలో పర్యావరణ పరిరక్షణకోసం ప్రదర్శనలు నిర్వహించిన తర్వాత నేరుగా గ్రేటా యూరోప్ కి వచ్చింది.

క్రిస్మక్ కు తిరిగి ఇంటికి చేరుకుని పండగ చేసుకున్న తర్వాత కొద్ది రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నట్టుగా గ్రేటా తెలిపింది. మొండిగా ముందుకు వెళ్తూ ఉంటే ఎక్కువకాలంపాటు అనుకున్న పనిని సాధించుకుంటూ పోవడం కష్టతరమవుతుందని, ఆ కారణంగా తను కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటున్నాని గ్రేటా చెబుతోంది.

పర్యావరణ పరిరక్షణ కోసం

ఫియట్ కారు నిర్మాణానికి పుట్టినిల్లుగా పేరుపడిన ఇటలీలోని టురిన్ నగరంలో కర్బన ఉద్గారాల నిరోధానికి, కాలుష్య నివారణకోసం ప్రభుత్వం తీసుకోవాల్సిన పటిష్టమైన చర్యలను డిమాండ్ చేస్తూ ఉద్యమించడానికి ప్రత్యేకించి ఇటలీకి వచ్చానని చెప్పిన గ్రేటా పర్యావరణ పరిరక్షణకోసం ప్రపంచదేశాలన్నీ కలసికట్టుగా ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమయ్యిందన్న సత్యాన్ని అందరూ గుర్తించాలని కోరుతోంది.

2019 సంవత్సరం పూర్తైపోవస్తోందనీ, 2020లోనైనా వీలైనంతమేరకు పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి భూమిపై ఉన్న దేశాలన్నింటిలోనూ పౌరులు పెద్ద ఎత్తున ఉద్యమించాలని గ్రేటా కోరుతోంది. కేవలం ప్రభుత్వాలమీదే బాధ్యతను మోపడంకాకుండా ఎవరికివారుగా పౌరులందరూ కూడా స్వతంత్రంగా పర్యావరణ కాలుష్యానికి కారణమైన అంశాలపై ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తూ తమ వంతు బాధ్యతను స్వీకరించాలని ఆమె కోరుతోంది.

పదిహేనేళ్ల వయసులో గ్రేటా స్వీడిష్ ప్రభుత్వం కర్బన ఉద్గారాలను నియంత్రించేందుకు పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాలని కోరుతూ ప్రతి శుక్రవారం స్కూల్ మానేసి స్వీడిష్ పార్లమెంట్ ఎదుట నిరసన తెలుపుతూ వచ్చింది. ఆమె తెలిపిన ఈ నిరసన పర్యావరణ పరిరక్షణకోసం ప్రత్యేక శుక్రవారాలు పేరిట దేశ వ్యాప్తంగా విశేషమైన ఆదరణను, విస్తృత స్థాయి ప్రచారాన్ని పొందాయి. దీంతో విశ్వవ్యాప్తంగా కోటానుకోట్లమంది సాధారణ ప్రజలుకూడా పర్యావరణ పరిరక్షణకోసం తమ వంతు కృషిని బాధ్యతగా స్వీకరించేందుకు ముందుకు రావడం మొదలయ్యింది.

చిన్న వయసులోనే పర్యావరణ పరిరక్షణకోసం గ్రేటా ఉద్యమిస్తున్న తీరుని, సామాన్యులకు సైతం అవగాహన కల్పించే స్థాయిలో ఆమె చేస్తున్న ప్రచారాన్ని ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ ప్రేమికులు ఎంతగానో మెచ్చుకుంటున్నారు. తాముకూడా పూర్తి స్థాయిలో గ్రేటా చేస్తున్న పోరాటానికి, విశ్వయాత్రకు పూర్తిస్థాయి మద్దతునిస్తామని అంటున్నారు.

Next Story