మా కలల్ని నాశనం చేయడానికి మీరెవ్వరూ?..ప్రపంచ వేదికపై గళమెత్తిన చిన్నారి..!!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  24 Sep 2019 10:58 AM GMT
మా కలల్ని నాశనం చేయడానికి మీరెవ్వరూ?..ప్రపంచ వేదికపై గళమెత్తిన చిన్నారి..!!

అమెరికా: "ఎంత ధైర్యం మీకు??" 16 ఏళ్ల చిన్నారి ఐక్య రాజ్యసమితి వేదికగా ప్రపంచంలోని పెద్దలందరిని అడిగిన ప్రశ్న ఇది.

"మా కలల్ని నాశనం చేస్తున్నారు. మా బాల్యాన్ని దోచుకుంటున్నారు... ఇదంతా మీ తప్పు. మీకెంత ధైర్యం??" అంటూ ఉద్వేగంతో ఆమె మాట్లాడింది. వాతావరణంలో పెనుమార్పులు చోటు చేసుకుంటుంటే ఎవరూ పట్టించుకోవడంలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. భావి తరాలు భయంకరమైన విపత్తును ఎదుర్కోక తప్పదంటూ హెచ్చరించింది. ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఆధ్వర్యంలో ప్రపంచ వాతావరణ శిఖరాగ్ర సదస్సు జరిగింది. ఈ సదస్సులో ప్రపంచ నేతలెందరో పాల్గొన్నారు. వారందరి ముందు గ్రెటా ధన్ బర్గ్ అనే చిన్నారి హెచ్చరిక ధోరణిలో ప్రసంగించింది.

“ప్రపంచం నాశనానికి అంచుల్లో ఉంటే మీరు (ప్రపంచ నేతలు) మాత్రం ఆర్ధిక అభివృద్ధి జరుగుతోంది అంటూ కట్టు కథలు అల్లుతున్నారు. వాతావరణ మార్పులతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రాణాలు కోల్పోతున్నారు. మా (భావితరాలు) ఆవేశం, ఆవేదన మీకు అర్ధం అవుతుందని అనుకుంటున్నాను. నిజంగా మీకు అర్ధమయితే పర్యావరణ పరిరక్షణ కోసం చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు" అంటూ గ్రెటా ధన్ బర్గ్ యూఎన్ఓ వేదిక మీద నుంచి ప్రపంచ నేతలను ప్రశ్నించింది.

మీరు ఇలాగే ప్రవర్తిస్తే భావితరాలు మిమ్మల్ని క్షమించవు అంటూ హెచ్చరించింది. గ్రెటా థన్ బర్గ్… స్వీడన్ కి చెందిన అమ్మాయి. ఈ అమ్మాయి కొద్ది సంవత్సరాలుగా పర్యావరణ పరిరక్షణ కోసం పోరాడుతోంది, ఆగస్టు 2018 లో స్వీడన్ పార్లమెంట్ బయట ఒంటరిగా ధర్నా చేసింది. ఎన్నో రోజుల నుంచి స్కూల్ మానేసి మరీ పోరాటం చేస్తోంది. అనేక వేదికలపై గ్రెటా తన గొంతు వినిపించింది.

అయితే, ఈ వేదికపై మాట్లాడించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎందుకంటే ...పర్యావరణానికి హాని కలుగుతుందని ఆమె విమానాలు ఎక్కదు. చిన్న నావలో అట్లాంటిక్ సముద్రం దాటి ప్రయాణం చేసి అమెరికా వచ్చింది గ్రెటా.

గ్రెటా ప్రసంగం విన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆమెకు అద్భుతమైన భవిష్యత్తు ఉందనీ, ఆమెను చూస్తే ఎంతో ఆనందంగా ఉందంటూ ట్విట్ చేశారు.

Next Story