మొక్కలు నాటిన మెగా పవర్ స్టార్

By సుభాష్  Published on  8 Nov 2020 6:45 AM GMT
మొక్కలు నాటిన మెగా పవర్ స్టార్

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ స్వీక‌రించి పూర్తి చేశారు. జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ తో కలిసి చెర్రీ మొక్కలు నాటాడు. ఈ సంద‌ర్భంగా చ‌ర‌ణ్ మాట్లాడుతూ.. ప్రభాస్ తనకు మొక్కలు నాటే అవకాశాన్ని కల్పించడం చాలా సంతోషంగా ఉందని, మొక్కలు నాటడం అనేది మనందరి ప్రాథమిక కర్తవ్యమని తెలిపారు. ప్రకృతి సమతుల్యంతో ఉంటేనే మనమందరం ఈ భూమి మీద జీవించగలుగుతామని ఆయన అన్నారు. ఈ సూక్ష్మాన్ని గ్రహించి తన వంతు బాధ్యతగా కొన్ని లక్షల మందిని తన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ద్వారా కదిలిస్తున్న జోగినిపల్లి సంతోష్ గారిని నేను మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అని చ‌ర‌ణ్ అన్నారు.

తన ఇంటి ఆవరణలో మొక్కలు నాటిన దృశ్యాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను రామ్ చరణ్ సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు. ఆలియా భ‌ట్, దర్శకుడు రాజమౌళి, ఆర్ఆర్ఆర్ సినిమా బృందం సభ్యులు అందరూ గ్రీన్ ఇండియా చాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని ఆయన సవాలు విసిరారు. ప్ర‌స్తుతం రామ్‌చ‌ర‌ణ్ 'ఆర్ఆర్ఆర్‌' (రౌద్రం రణం రుథిరం) చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ పిరియాడిక్ చిత్రంలో ఎన్టీఆర్‌ కొమురంభీమ్‌ పాత్రలో నటిస్తుండగా.. చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా క‌నిపించ‌నున్నారు. ద‌ర్శ‌క‌దీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో భారీ అంచ‌నాలు ఉన్నాయి.Next Story