Fact Check : కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు స్మార్ట్ ఫోన్ లు అందిస్తోందా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  10 Sep 2020 2:25 PM GMT
Fact Check : కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు స్మార్ట్ ఫోన్ లు అందిస్తోందా..?

కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లు అందిస్తోందని సామాజిక మాధ్యమాల్లో ఓ పోస్టు వైరల్ అవుతోంది. కోవిద్-19 సమయంలో ఆన్ లైన్ లో విద్యార్థులు విద్యనభ్యసించాలని కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు స్మార్ట్ ఫోన్స్ అందించడానికి ముందుకు వచ్చిందని ఆ మెసేజీలలో చెబుతూ ఉన్నారు. స్మార్ట్ ఫోన్స్ వలన విద్యార్థులు ఆన్ లైన్ లో చదువుకోవచ్చని చెబుతూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం పేద విద్యార్థులకు మేలు చేకూర్చాలనే ఉద్దేశ్యంతో ఈ పని చేస్తోందని మెసేజీని వైరల్ చేస్తూ ఉన్నారు.

G1

ఈ మెసేజీ గురించి నిజా నిజాలు తెలియజేయాలని వాట్సప్ లో న్యూస్ మీటర్ కు రిక్వెస్ట్ అందింది. ఆ మెసేజీ స్క్రీన్ షాట్ ను చూడొచ్చు.

ఆ మెసేజీలో 'స్కూల్స్, కాలేజీలు కరోనా వైరస్ కారణంగా మూసి వేశారు. దీని వలన విద్యార్థులు ఎక్కువగా నష్టపోతూ ఉన్నారు.. అందువలన విద్యార్థులకు ఉచితంగా ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్స్ ఇవ్వాలని భారత ప్రభుత్వం నిర్ణయించుకుంది. మొబైల్ ఫోన్స్ ద్వారా అకాడెమిక్ సంవత్సరాన్ని విద్యార్థులు పూర్తీ చేసే అవకాశం ఉంది. మీరు కూడా స్మార్ట్ ఫోన్ ను సొంతం చేసుకోవాలంటే http://bit.ly/Register-Your-Free-Android-Smartphone/ ఈ లింక్ ను ఓపెన్ చేయండి. ఇతరులు కూడా ఈ సదుపాయాన్ని పొందాలి అంటే వారికి పంపించండి.' అని మెసేజీలో ఉంది.

నిజ నిర్ధారణ:

ఉచిత స్మార్ట్ ఫోన్స్ అంటూ వైరల్ అవుతున్న మెసేజీలో ఎటువంటి 'నిజం లేదు'.

న్యూస్ మీటర్ మెసేజీలో ఉన్న లింక్ మీద క్లిక్ ఇవ్వగా.. మరొక పేజీలోకి వెళ్లడం గమనించవచ్చు. అందులో ఉన్న సమాచారం ప్రకారం రిజిస్టర్ చేసుకోడానికి ఆఖరు తేదీ సెప్టెంబర్ 20, 2020. స్మార్ట్ ఫోన్ ను అందుకోవాలంటే అక్కడ ఇచ్చిన ఫామ్ లో పేరు, ఫోన్ నెంబర్, ఊరి పేరు, పిన్ కోడ్ లాంటివి పొందుపరచాలి.

అది ప్రభుత్వానికి చెందిన అధికారిక పేజీ అయితే కాదు. అదొక బ్లాగింగ్ సర్వీస్ ను అందించే బ్లాగ్ స్పాట్. దీని గురించి ప్రభుత్వం నుండి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.

గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు చెందిన అధికారిక వెబ్ సైట్ ను పరిశీలించగా అందులో ఉచితంగా మొబైల్ ఫోన్ ఇస్తాము అని చెప్పే ఎటువంటి నోటీసు కూడా కనిపించలేదు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన అధికారులు కూడా ఎవరూ అధికారికంగా స్టేట్మెంట్ ను విడుదల చేయలేదు.



ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పిఐబి) ఈ వార్తలలో నిజం లేదని తేలుస్తూ ట్వీట్ ను చేసింది. కేంద్ర ప్రభుత్వం అలాంటి అనౌన్స్మెంట్ చేయలేదని.. అటువంటి సైట్లను క్లిక్ చేయడం ద్వారా మన సమాచారం ఇతరుల చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉందని హెచ్చరించారు.

కేంద్ర ప్రభుత్వం ఉచితంగా స్మార్ట్ ఫోన్ లను ఇస్తామని ఎటువంటి హామీని ఇవ్వలేదు. అయితే పంజాబ్ ప్రభుత్వం మాత్రం 12వ తరగతి చదువుతున్న విద్యార్థులకు మొబైల్ ఫోన్ ను అందించింది. 'పంజాబ్ స్మార్ట్ కనెక్ట్ స్కీమ్' ద్వారా 1,74,015 మంది 12వ తరగతి విద్యార్థులకు లాభం చేకూరనుంది.

విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ ఫోన్స్ ఇస్తోందంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.

Next Story