స్విస్ బంగారం: ఎన్నో దారుల్లో హైదరాబాద్ కు..!

By రాణి  Published on  21 Feb 2020 12:55 PM GMT
స్విస్ బంగారం: ఎన్నో దారుల్లో హైదరాబాద్ కు..!

టైటిల్ చూడగానే ఇదేదో కొత్త రకం బంగారం మన దగ్గరకు వస్తోందా అని అనుకోకండి..! ఎందుకంటే స్విస్ నుండి స్మగ్లింగ్ చేయబడిన బంగారం.. హైదరాబాద్ లో అమ్మకాలకు పెడుతున్నారు. హైదరాబాద్ లోకి చాలా మార్గాల ద్వారా బంగారాన్ని స్మగ్లింగ్ చేశారని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డి.ఆర్.ఐ.) సీనియర్ అధికారులు గురువారం నాడు స్పష్టం చేశారు. మయన్మార్ నుండి భారత్ లోకి.. శ్రీలంక నుండి సముద్ర మార్గంలోకి.. ఇతర దేశాల నుండి వాయు మార్గంలో స్విస్ బంగారాన్ని తీసుకొని వచ్చారని డి.ఆర్.ఐ. అధికారులు తెలిపారు.

డి.ఆర్.ఐ. లెక్కల ప్రకారం 2019-20లో 25కేసులు నమోదయ్యాయని.. మొత్తం 160 కేజీల బంగారాన్ని సీజ్ చేశామని అధికారులు స్పష్టం చేశారు. ఈ బంగారం విలువ దాదాపు 60 కోట్ల రూపాయలని అధికారులు అంచనా వేస్తున్నారు. 2018-19 లో 13కోట్ల విలువైన 40 కేజీల బంగారం సీజ్ చేశారని చెప్పారు. దేశీయ మార్కెట్ లో బంగారానికి డిమాండ్ బాగా పెరగడంతో స్విస్ బంగారాన్ని స్మగ్లింగ్ చేయడం కూడా భారీగా పెరిగిందని అధికారులు అంటున్నారు. ప్రపంచం లోనే అతి పెద్ద గోల్డ్ రిఫైనరీలు ఉన్న దేశాల్లో స్విజర్లాండ్ కూడా ఒకటి. ఆఫ్రికా దేశాల నుండి గోల్డ్ మైన్ల నుండి బయటకు తీసిన బంగారాన్ని స్విజర్లాండ్ లో గోల్డ్ బార్స్ గా మారుస్తారు. స్వచ్ఛతలో కూడా స్విస్ బంగారానికి మంచి పేరు ఉంది. దీంతో ఈ బంగారాన్ని భారత్ లోకి తీసుకొని రావాలని వస్తారని.. పట్టుబడిన బంగారంలో చాలా వరకూ స్విస్ కు చెందినదేనని డి.ఆర్.ఐ. అధికారి ఒకరు చెప్పారు.

'వాళ్కంబి స్విస్ గోల్డ్' సీల్ ఉన్న గోల్డ్ బార్ లను డి.ఆర్.ఐ. అధికారులు సీజ్ చేశారు. స్విజర్లాండ్ లో తక్కువ ధరకే వాటిని అధికారికంగా కొన్న ట్రేడర్లు.. వాయు మార్గంలో వాటిని ఇక్కడకు స్మగ్లింగ్ చేస్తున్నారు. స్విజర్లాండ్ నుండి భారత్ అఫీషియల్ గానే ఎక్కువ బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది. అనధికారంగా కూడా ఎక్కువ మొత్తంలో భారత్ కు స్విస్ బంగారం తరలి వస్తోంది. స్విజర్లాండ్ తర్వాత యుఎఈకి చెందిన బంగారాన్ని ఎక్కువ మొత్తంలో డి.ఆర్.ఐ. అధికారులు సీజ్ చేశారు. సముద్ర మార్గంలో శ్రీలంక నుండి తమిళనాడులోని రామనాథపురానికి తరలిస్తున్నారని.. అక్కడి నుండి రోడ్డు మార్గంలో హైదరాబాద్ కు బంగారాన్ని తరలిస్తున్నారు. ఇక రోడ్డు మార్గంలో మయన్మార్ నుండి గౌహతి చేరుకునే బంగారం.. అక్కడి నుండి హైదరాబాద్ కు తరలిస్తున్నారు. మిజోరాం-మణిపూర్ బోర్డర్ కు దగ్గరలో మయన్మార్ లో ఉన్న గోల్డ్ రిఫైనరీలు ఈ అక్రమ బంగారం రవాణా చేసే కీలక ప్రాంతాలు. 2018-19 లో 32.9బిలియన్ డాలర్ల విలువైన 982 టన్నుల బంగారాన్ని భారత్ దిగుమతి చేసుకోగా.. అందులో సగానికి పైగా స్విజర్లాండ్ నుండి దిగుమతి చేసుకుందేనని మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ తెలిపింది.

Next Story