పరుగులు పెడుతున్న బంగారం ధర
By సుభాష్ Published on 10 July 2020 7:47 AM GMTదేశంలో బంగారం ధర పరుగులు పెడుతోంది. కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్నబంగారం ధర ఇప్పుడు కొండెక్కుతోంది. ఎక్సైజ్ సుంకం, రాష్ట్ర పన్నులు, ఛార్జీలు వసూలు చేయడం కారణంగా దేశంలో బంగారం అభరణాల ధర పెరిగిపోతోంది. ప్రస్తుతం భారత్ మార్కెట్లో పసిడి ధర రికార్డు సృష్టిస్తోంది. తాజాగా హైదరాబాద్‌లో 10 గ్రాముల బంగారంపై రూ.480 పెరిగి ప్రస్తుతం రూ. 51,460కి ఎగబాకింది.
ఇక ఇదే సమయంలో వెండి కూడా అదే బాటలో పరుగులు పెడుతోంది. కిలో బంగారం ధరపై రూ.1,890 పెరిగి, ప్రస్తుతం కిలో వెండి ధర రూ.52వేలకు చేరుకుంది. ఇక ఢిల్లీలో బంగారం ధర రూ.50,190 ఉండగా, ముంబైలో రూ.49,240 ఉంది. అయితే ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఎక్కువగా డబ్బులు బంగారంపై పెట్టడం వల్ల బంగారం ధరలు పెరగడానికి కారణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
ఇక అంతర్జాతీయంగా మార్కెట్లో ఔన్స్ బంగారం ధర రూ.1,800 డాలర్లకు చేరుకోగా, వెండి ధర 18డాలర్లకు ఎగబాకేసింది. అయితే బంగారం ధరలు ఇలాగే మరింత కాలం కొనసాగే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు మరో రెండేళ్లలో 10 గ్రాముల బంగారం ధర రూ.65వేలకు చేరుకున్నా పెద్దగా ఆశ్చర్యపోనక్కరలేదని చెబుతున్నారు.