తెలుగోళ్ళకు ముక్కలేనిది ముద్ద దిగడం లేదు..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  1 Nov 2019 9:43 AM GMT
తెలుగోళ్ళకు ముక్కలేనిది ముద్ద దిగడం లేదు..!

  • తెలుగు రాష్ట్రాల్లోనే మాంస ప్రియులు అధికం
  • ఇండియాలోనే మాంసాహారుల్లో తెలంగాణ ఫస్ట్
  • దక్షిణ భారతీయులకు మాంసంపై మక్కువ
  • శాఖామారుల్లో రాజస్థాన్ టాప్, సెకండ్ గుజరాత్
  • దేశరాజధాని ఢిల్లీలోనూ దాదాపు 40 శాతం మంది శాఖాహారులు
  • దేశం మొత్తం మీద ముక్కపై మక్కువ చూపుతున్న పురుషులు
  • GOI సర్వేలో ఆసక్తికర విషయాలు

GOI జనాభా లెక్కలు ఇండియాలో శాఖహారులు ఎంత మంది ఉన్నారు..మాంసాహారులు ఎంత మంది ఉన్నారో లెక్క తేల్చింది.GOI సర్వే కచ్చితమైన గణాంకాలను ఇచ్చింది. రాష్ట్రాల వారీగా లెక్క తేల్చడమే కాదు..మహిళలు ఎంత మంది మాంసాహారులు, శాఖా హారులో తేల్చి చెప్పింది. మొత్తం మీద ఈ సర్వేలో తేలింది ఏంటంటే..సౌత్ ఇండియన్లు మాంసాప్రియులు..ముక్క ముట్టందే ముద్ద దిగదు. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో 98 శాతంపైగానే మాంసప్రియులున్నారు.

ఇండియాలో విజిటేరియన్లలో 28.4 శాతం పురుషులు, 29.3 శాతం మహిళలు ఉన్నారు. ఇక నాన్ వెజ్ లో చాలా వరకు పురుషులు , మహిళలు రాజీపడటం లేదు. నాన్ వెజ్ తినేవారిలో పురుషులు 71.6 శాతం ఉంటే..మహిళలు 70.7శాతం ఉన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో వెజిటేరియన్లు చాలా అంటే చాలా తక్కువ. ఏపీలో పురుషుల్లో వెజిటేరియన్లు 1.6శాతం , మహిళల్లో 1.9 మాత్రమే ఉన్నారు. పురుషుల్లో 98.4 శాతం, మహిళల్లో 98.1 శాతం మాంసాహారులే. ఏపీ కంటే తెలంగాణలో మాంస ప్రియులు కాస్త ఎక్కువ. తెలంగాణ పురుషుల్లో వెజిటేరియన్లు కేవలం 1.2 శాతం, మహిళల్లో 1.4 శాతం. ఇక నాన్ వెజ్ లో మాత్రం.. పురుషులు 98.8 శాతం, మహిళలు 98.6 శాతం ఉన్నారు. మొత్తానికి తెలుగురాష్ట్రాల ప్రజలకు ముక్కలేనిది ముద్ద దిగడం లేదు. మన తెలుగురాష్ట్రాలే కాదు..సౌతిండియా మొత్తం దాదాపుగా మాంస ప్రియులేనని GOI సర్వే చెబుతుంది. ఏపీని ఆనుకుని ఉన్న ఒడిశాలో కూడా 98 శాతం మంది మాంస ప్రియులే.

తమిళనాడు పురుషుల్లో 97.8 శాతం, మహిళల్లో 97.5 శాతం మాంస ప్రియులు. కర్ణాటకలో కాస్త మాంస ప్రియులు తక్కువుగా ఉన్నారు. ఇక్కడ మఠాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. కర్ణాటక పురుషుల్లో 97.4శాతం, మహిళల్లో 96.6 శాతం మాంస ప్రియులు. ఇక...కేరళలో కూడా మాంస ప్రియులు అధికమే. ఇక్కడ పరుషుల్లో 97.4శాతం, మహిళల్లో 96.6శాతం మాంస ప్రియులు. సౌతిండియాలో మాంస ప్రియుల్లో తెలంగాణ మొదటి స్ధానంలో ఉంటే..కర్ణాటక చివరి స్థానంలో ఉంది. ఇక..మిగిలిన స్టేట్ లతో పోల్చుకుంటే..ఒక్క వెస్ట్ బెంగాలే మాంస ప్రియుల్లో తెలుగు స్టేట్ లకు దగ్గరగా ఉంది.

ఇక..ఉత్తర, పశ్చిమ భారత దేశాలు చాలా వరకు మాంసాహారానికి దూరంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా గుజరాత్, రాజస్థాన్, హర్యానా, మధ్యప్రదేశ్, యూపీలు మాంసాహారానికి చాలా దూరంగా ఉన్నాయి. రాజస్థాన్ లో దాదాపుగా అందరూ శాఖాహారులే. ఈ స్టేట్ లో పురుషుల్లో శాఖాహారులు 73.2శాతముంటే..మహిళలు 76.6శాతం ఉన్నారు. ఇక..గుజరాత్ లో శాఖాహారుల్లో పురుషులు 60.1 శాతముంటే..మహిళలు61.8 శాతం ఉన్నారు. హర్యానాలో కూడా శాఖాహారులే ఎక్కువ . ఇక్కడ పురుషుల్లో శాఖాహారులు 68.5 శాతముంటే, మహిళలు 70శాతం ఉన్నారు. మధ్యప్రదేశ్ లో శాఖాహారులు, మాంసాహారులు దాదాపు సగంసగంగా ఉన్నారు. మధ్యప్రదేశ్ లో శాఖాహారుల్లో పురుషులు 48.9శాతముంటే, మహిళలు 52.3శాతం ఉన్నారు. ఇక్కడ విచిత్రమేమంటే ఎంపీ నుంచి విడిపోయిన ఛత్తీస్ గఢ్ లో దాదాపు 75 శాతం మందికి ముక్క ముట్టందే ముద్ద దిగదు.

ఇక..దేశంలోని అతి పెద్ద స్టేట్ యూపీ . ఇక్కడ కూడా శాఖాహారులు, మాంసాహారులు 50 -50 గా ఉన్నారు. యూపీ శాఖాహారుల్లో పురుషులు 45 శాతం ఉంటే..మహిళలు 49.2శాతం ఉన్నారు. ఇక.. దేశ రాజధాని ఢిల్లీలోనూ 40శాతం మంది శాఖాహారులు ఉండటం గమనార్హం. ఇక్కడ శాఖాహారుల్లో 36.8శాతం పురుషులుంటే, మహిళలు 42.2శాతం ఉన్నారు. మహారాష్ట్రలోనూ 40శాతం శాఖాహారులు ఉండటం గమనార్హం. ఈ స్టేట్ లో కూడా పురుషుల్లో శాఖాహారులు 41 శాతముంటే..మహిళలు 39. 4శాతం ఉన్నారు. బిహార్ , జార్ఖండ్ లో కూడా మాంసప్రియులే ఎక్కువ. యూపీ నుంచి విడిపోయిన ఉత్తరాఖండ్ లోనూ మాంసప్రియులే చాలా మంది ఉన్నారు.

సర్వే ద్వారా చాలా విషయాలు తెలుచుకోవచ్చు. మన భోజన అలవాట్లను మన సంప్రదాయ, ఆచారాలు ప్రభావితం చేస్తున్నాయని తెలిసిపోతుంది.

Image



  • వై.వి.రెడ్డి, న్యూస్ ఎడిటర్, న్యూస్ మీటర్

Next Story