ప్రాణాలు తీసిన పాతస్నేహాం.. అతడి హత్య.. ఆమె ఆత్మహత్య

By Newsmeter.Network  Published on  29 Feb 2020 11:12 AM IST
ప్రాణాలు తీసిన పాతస్నేహాం.. అతడి హత్య.. ఆమె ఆత్మహత్య

ఆ ఇద్దరు డిగ్రీలో కలిసి చదువుకున్నారు. అతను ప్రేమ పేరుతో ఆమె వెంట పడేవాడు. అయితే అతని ప్రేమను ఆమె తిరస్కరించింది. అనంతరం.. ఆమెకు వేరే వ్యక్తితో పెళ్లైంది. కొంతకాలం తరువాత పేస్‌బుక్‌లో కలిశాడు. పాతమిత్రుడే కదా అని.. ఆమె మాట్లాడింది. అతని ప్రవర్తన నచ్చక మాట్లాడం మానేసింది. దీంతో ఆ యువకుడు బ్లాక్‌మెయిల్‌కు పాల్పడేవాడు. ఇంతలో అతని మృతదేహాం దొరికిందన్న సమాచారం తెలుసుకున్న ఆ గృహిణి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మహబూబ్‌నగర్‌లో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని వెంకట రమణ కాలనీకి చెందిన రాగసుధ(29)కు మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రేమ్‌నగర్‌కు చెందిన బలగం ఉదయ్‌కుమార్‌ తో 2011లో పెళ్లైంది. వీరికి 5 సంవత్సరాల కుమారుడు రోహిన్‌ ఉన్నాడు. ఉదయ్‌కుమార్‌ ఓ బ్యాంకులో అసిస్టెంట్‌ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. గతంలో రాగసుధతో పాటు కార్తీక్‌ అనే యువకుడు ఆమెతో పాటు డిగ్రీ చదువుకున్నాడు. చాన్నాళ్ల తర్వాత మళ్లీ ఫేస్‌బుక్‌లో కలిశాడు. కొద్ది రోజులు స్నేహాంగా మెలిగిన రాగసుధ అతని ప్రవర్తన నచ్చక మాట్లాడటం మానేసింది. దీంతో అప్పటి నుంచి అతను రాగసుధను వేధించేవాడు. ఆమె తల్లిదండ్రులకు సైతం ఫోన్‌ చేసి బెదిరింపులకు పాల్పడేవాడు. నాతో మాట్లాడాలని, మాట్లాడకపోతే.. ఇద్దరి అక్రమ సంబంధం ఉందని నీ భర్తకు చెబుతానని బెదిరించేవాడు. ఈ క్రమంలో ఆమె నుంచి దాదాపు లక్ష వరకు గుంజాడు. అతడి వేధింపులతో విసిగిపోయిన ఆమె.. కార్తీక్‌ బెదిరింపుల విషయాన్ని మరో స్నేహితుడు రవికి చెప్పింది. అతను కార్తీక్‌ను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం కార్తీక్‌ను రవి తీసుకెళ్లి హత్య చేసి మట్టిలో పూడ్చి పెట్టాడు.

ఇదిలా ఉండగా.. ఈ నెల 24 నుంచి కార్తీక్‌ కనిపించకుండా పోయాడు. అతని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు అతడితో పాటు డిగ్రీలో వారితో కలిసి చదువుకున్న రవి, మరో యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే.. గద్వాల మండలం కొండపల్లి దగ్గర గుట్టల్లో నెట్టెంపాడు కాల్వ పనులు జరుపుతుండగా.. శుక్రవారం కార్తీక్‌ మృతదేహాం దొరికింది. అతని తలపై రాళ్లతో మోదీ హత్య చేసి ఉంటారని.. చనిపోయి మూడు రోజులై ఉంటుందని భావిస్తున్నారు. కార్తీక్‌ మృతితో హత్య కేసును చేధించే క్రమంలో రాగసుధ విషయం బయటపడింది. ఈ విషయంలో గద్వాలలో ఉన్న ఆమె తల్లిదండ్రులను పోలీసులు విచారించారు. తల్లిదండ్రులు ఈ సమాచారాన్ని కూతురుకు అందించారు.

అతడి మృతదేహాం దొరికిందన్న సమాచారం తెలిసి మహబూబ్‌ నగర్‌లో ఉన్న రాగసుధ.. తాను చనిపోతున్నానంటూ తన తండ్రి నాగేందర్‌కు ఫోన్‌ చేసి చెప్పింది. తన కొడుకు రోహిన్‌ను స్కూల్‌కు పంపించి నేను ఏ తప్పు చేయలేదు. నన్ను అందరూ క్షమించండి. నా కొడుకును జాగ్రత్తగా చూసుకోండి అని సూసైడ్‌ నోట్‌లో రాసిపెట్టి శుక్రవారం మధ్యాహ్నాం ప్రేమ్‌నగర్‌లోని ఆమె ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

Next Story