చీకట్లో కౌగిలించుకోగానే వెయ్యి లైట్లు వెలిగితే..??

By రాణి  Published on  7 Feb 2020 12:35 PM GMT
చీకట్లో కౌగిలించుకోగానే వెయ్యి లైట్లు వెలిగితే..??

సాయంకాలమౌతుంది. చల్లగాలి వీస్తుంది. ఒక పిల్లతెమ్మెర అలా పూల పరిమళాలన్ని పల్లకీలో మోసుకొచ్చినట్టు మోసుకొస్తుంది. ప్రియుడి మనసులో చిలిపి కోరికలు చెలరేగుతాయి. ప్రియురాలిని చూసి కన్ను గీటుతాడు. ప్రియురాలి కళ్లు వింతగా మెరుస్తాయి. అంతే నెమ్మదిగా ఇద్దరూ చేరువౌతారు. కోరికలు కోడెనాగులౌతాయి. ఇద్దరూ ఎవరూ లేని చోటకు చేరుకుంటారు. రక్తం పొంగుకొస్తుంది. ఎద బరువెక్కుతుంది. ఇద్దరూ గట్టిగా కౌగిలించుకుంటారు...

ఆ తరువాత..ఆ తరువాత..ఏమైంది..చెప్పు..చెప్పు..ఊ..కమాన్..ఉన్నట్టుండి వెయ్యి ఫ్లాష్ బల్బులు వెలుగుతాయి. మొత్తం లైట్లన్నీ ఆ ప్రేమికులపై ఫోకస్ అవుతాయి. దాంతో బెదిరి ఇద్దరూ తుర్రు మంటారు. ఆ తరువాత ప్రియుడు కన్ను గీటడు. కన్ను గీటినా ప్రియురాలు ఎదను మీటదు.

సరిగ్గా ఇదే జరుగుతోంది మిణుగురుల విషయంలో. చీకటి పడగానే మగ మిణుగురు కన్ను గీటినట్టు ఒక వెలుగురవ్వను వెదజలుతుంది. “నేనూ మూడ్ లోనే ఉన్నాను.” అంటూ ఆడ మిణుగురు చిత్ర విచిత్రంగా వీపు మీద టార్చ్ ను ఆన్ ఆఫ్ చేసి రెచ్చగొడుతుంది. “పద పొదల్లోకి పోదాం” అంటూ ఒకదానికొకటి వెలుగులు చూపుతూ, తన ఉనికిని తెలియచేస్తూ పొదల మాటున రతికేళి కోసం వెళ్లిపోతాయి. ఇక్కడే మొదలవుతోంది సమస్య. హోర్డింగ్ ల మీది లైట్లు, కార్లు, మోటర్ల నుంచి వచ్చే వెలుగులు, ఇళ్ల ముందు ఉన్న లైట్లు పంపించే వెలుగు సిగ్నల్స్, మిణుగురుల లవ్ సిగ్నల్స్ ని డామినేట్ చేసేస్తున్నాయట. దీంతో పాపం మిణుగురులు మైథునం మానేసి అటూ ఇటూ పరుగులు తీసేస్తున్నాయట. అడవుల్లో రోడ్లు వేయడం, భవన నిర్మాణం, కాంక్రీట్ జంగిల్స్ పెరిగిపోవడం వంటి వాటి వల్ల పాపం మిణుగురులకు ప్రైవసీ లేకుండా పోతోందట. రాత్ కా రాజా, రాత్ కీ రాణీలు కలుసుకోకుండా పనికిమాలిన లైట్లు రచ్చ రచ్చ చేసేస్తున్నాయట.

చాలా జంతువులకు ఈ సమస్య ఉందట. కానీ మిణుగురులకు మరీ ఎక్కువగా ఉందట. ఇలా మిణుగురుల జనాభా తగ్గిపోతే చాలా నష్టాలుంటాయని అమెరికాలోని టఫ్ట్స్ యూనివర్సిటీ, ఇంటర్నేషనలయ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ సంస్థల పరిశోధనలు చెబుతున్నాయి. చిన్న చిన్న కీటకాల జనాభాను తగ్గించడం, పక్షులకు ఆహారంగా మారడం, పుప్పొడి రేణువులను పూలలోని అండకోశాలకు చేర్చి ఫలదీకరణం జరిపించడం ఇవన్నీ మిణుగురులు చేసే పనులు. వీటి సంఖ్య తగ్గిపోవడంలో ఆహార లభ్యత గొలుసుకట్టు తెగిపోతోందని, పర్యావరణానికి తీరని నష్టం జరుగుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Next Story