ముంబై: భారత జట్టు మాజీ కెప్టెన్‌, క్యాబ్‌ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ భారత క్రికెట్‌ నియంత్రణ మండల (బీసీసీఐ) అధ్యక్షుడిగా ఎన్నికవడం దాదాపు ఖాయమైంది. ఎందుకంటే అధ్యక్ష పదవి కోసం మరెవరూ కూడా నామినేషన్‌ దాఖలు చేయలేదు. కాగా ఏకగ్రీవంగా గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికకానున్నారు. కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌ షా తనయుడు జై షా కార్యదర్శిగా వ్యహరించనున్నారు. అరుణ్‌ ధుమాల్‌ బోర్డు కోశాధికారిగా ఎంపిక కానున్నారు. ప్రపంచ క్రికెట్‌లోనే పెద్ద బోర్డుకు నాయకత్వం వహించడం చిన్న విషయం కాదు. ఆర్థికంగా బీసీసీఐ ఎంతో పరిపుష్టమైన వ్యవస్థ.. మరీ దీన్ని దాదా ఎలా ఎదుర్కొంటాడో చూడాలి. గత మూడేళ్లుగా బోర్డు బాధ్యతలు, పేరు ప్రఖ్యాతాలు బాగా దెబ్బతిన్నాయి. దీంతో గంగూలీకి ఎదురయ్యే సవాళ్లు.. చేయబోయే సంస్కరణలపై తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. గంగూలీ ఎన్నిక ఏకగ్రీవం కావడంతో నెటిజన్లు ఓ ఆసక్తికర చర్చను తెరమీదికి తీసుకొచ్చారు.

కోచ్‌ రవిశాస్త్రి, గంగూలీ మధ్య బేధాభిప్రాయాలు ఉన్న విషయం తెలిసిందే. నాలుగేళ్ల కిందట భారత జట్టు కోచ్ పదవికి అనిల్‌ కుంబ్లేతో పాటు రవిశాస్త్రి కూడా రేసులో నిలిచాడు. కానీ రవిశాస్త్రిని పక్కనే పెట్టి కుంబ్లేనే కోచ్‌గా బీసీసీఐ ఎంపిక చేసింది. దీంతో తనను కోచ్‌ పదవికి రిజెక్ట్‌ చేయడానికి గంగూలీనే ప్రధాన కారణమని రవిశాస్త్రి ఆరోపణలు చేశారు. అంతేస్థాయిలో గంగూలీ కూడా దీటుగా బదులిచ్చాడు. కట్‌ చేస్తే ఏడాది తర్వాత కోహ్లీతో కుంబ్లేకు గోడవ కారణంగా కుంబ్లే పదవి నుంచి దిగిపోయాడు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో గంగూలీ నేతృత్వంలోని కమిటీ రవిశాస్త్రిని కోచ్‌గా ఎంపిక చేసింది. అయితే కాలం ఎప్పుడు ఒకలా ఉండదు. ఇప్పుడు బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ ఎన్నికయ్యాడు. దీంతో రవిశాస్త్రిపై గంగూలీ తన ప్రతీకారం తీర్చుకునే సమయం వచ్చిందని నెటిజన్లు అనుకుంటున్నారు. రవిశాస్త్రి భవిష్యత్తు ఏంటని ఫన్నీగా మాట్లాడుకుంటున్నారు. రవిశాస్త్రి మీద సరదాగా మీమ్సన్‌ రూపొందించి నెటిజన్లు ఓ ఆటాడుకుంటున్నారు. మరో వైపు దాదా కొత్తగ్యాంగ్‌ ఏర్పరుచుకుంటాడని మరి కొందరు కామెంట్‌ చేస్తున్నారు. మరీ ముందు ఏం జరుగుతుందో వేచిచూడాలి.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.