'మోడల్' పై యువకుల అత్యాచారం

By సుభాష్  Published on  10 Jan 2020 5:04 PM GMT
మోడల్ పై యువకుల అత్యాచారం

దేశంలో దారుణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తెలంగాణ దిశ ఘటన జరిగిన నాటి నుంచి మహిళలపై ఎన్నో దారుణాలు చోటు చేసుకున్నాయి. తాజాగా హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ పోలీసుస్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. తెలంగాణ మిస్ మోడల్ కు ప్రయత్నిస్తున్న ఓ యువతిపై ఇద్దరు యువకులు దారుణంగా అత్యాచారం చేశారు. ఓ వ్యక్తి అత్యాచారం చేస్తుండగా, మరో యువకుడు సెల్ ఫోన్ లో వీడియోను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఆమెకు మద్యం తాగించి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది.

కాగా, డిసెంబర్ 28న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటన జరిగిన రోజే బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కేసుపై పోలీసుల ఎలాంటి చర్యలు తీసుకోవాలని, శుక్రవారం బాధితురాలు మీడియాను ఆశ్రయించింది. ఈ ఘటనకు సంబంధించి డిసెంబర్ 28న యువతి జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించగా, పోలీసులు మాత్రం జనవరి 7వ తేదీన ఫిర్యాదును నమోదు చేసినట్లు తెలుస్తోంది.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టలేదని బాధితురాలు మీడియా ముందు ఆరోపించింది. తనపై ఇలాంటి దారుణం జరిగినా పోలీసులు పట్టించుకోవడం లేదని, ఇక మహిళలకు రక్షణ ఎలా ఉంటుందని యువతి ఆరోపించింది. కేసును నీరుగార్చేందుకు పోలీసులు ఇలా వ్యవహరిస్తున్నారని, తనకు న్యాయం జరగాలని బాధితురాలు డిమాండ్ చేస్తోంది.

కాగా, చివరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.

Next Story
Share it