దివ్యను అందుకే చంపేశాను.. పోలీసుల ముందు నిజాన్ని బయటపెట్టిన నిందితుడు
By సుభాష్ Published on 20 Feb 2020 9:46 PM IST
సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో బ్యాంకు ఉద్యోగిని దివ్య దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. వేములవాడకు చెందిన నిందితుడు వెంకటేష్ పోలీసుల ముందు పలు నిజాలను బయటపెట్టాడు. దివ్యను నేనే చంపేశాను అని వెంకటేష్ అంగీకరించినట్లు ఏసీపీ నారాయణ వెల్లడించారు.
తనకు దక్కని దివ్య మరెవరికీ దక్కకూడదనే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు వెంకటేష్ చెప్పినట్లు ఏసీపీ తెలిపారు. కాగా, తన కూతురును కొన్ని రోజులుగా వేధిస్తున్నాడని, వెంకటేషే హత్య చేసి ఉంటాడని మృతురాలి తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసు విచారణలో భాగంగా ఐదు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు ఏసీపీ తెలిపారు.
వెంకటేష్, దివ్య ఒకే పాఠశాలలో చదువుకున్నారు..
వెంకటేష్, దివ్య ఒకే పాఠశాలలో చదువుకున్నారని, చదుకునే రోజుల్లో ఇద్దరి మధ్య మంచి పరిచయం ఏర్పడిందని ఏసీపీ తెలిపారు. దివ్య పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే సమయంలో వెంకటేష్ ఆమెను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుందామని వేధించాడు. తర్వాత బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న దివ్య.. వెంకటేష్‌ను దూరం పెట్టడంతో కక్ష్య పెంచుకున్నాడు.
తనకు దక్కకుండా ఎవ్వరికీ దక్కేది లేదని భావించిన వెంకటేష్ ఈనెల 18న అద్దె ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆమెపై దాడి చేసి హత్య చేసినట్లు చెప్పారు. వెంకటేష్ వెంట తెచ్చుకున్న కత్తితో దివ్య గొంతు, ఇతర భాగాలపై పొడిచి దారుణంగా హత్య చేసినట్లు వెల్లడించారు. అనంతరం వెంకటేష్ నేరుగా సికింద్రాబాద్ వెళ్లి అక్కడి నుంచి రైల్లో విజయవాడ వెళ్లిపోయాడు. విజయవాడ నుంచి వరంగల్ మీదుగా వేములవాడకు చేరుకున్నాడని తెలిపారు. ఈ నేరాన్ని అంగీకరించిన వెంకటేష్‌ను న్యాయమూర్తి ముందు హాజరు పర్చి అనంతరం రిమాండ్‌కు తరలించారు.