గగన్ యాన్ కు రెడీ అవుతున్న భారత పైలట్లు..!

By రాణి  Published on  11 Feb 2020 11:45 AM GMT
గగన్ యాన్ కు రెడీ అవుతున్న భారత పైలట్లు..!

భారత్ కు చెందిన నలుగురు పైలట్లకు వ్యోమగాములుగా తీర్చిదిద్దే ట్రైనింగ్ మొదలైంది. సోమవారం భారత్ కు చెందిన నలుగురు పైలట్లకు ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ మొదలుపెట్టారు. 12 నెలల పాటు మాస్కోలోని 'గగారిన్ రీసర్చ్ అండ్ టెస్ట్ కాస్మోనాట్ ట్రైనింగ్ సెంటర్(GCTC)' లో వీరికి ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు రష్యన్ స్పేస్ బిజినెస్ కంపెనీ గ్లావ్కాస్మోస్ ప్రకటించింది.

భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న స్పేస్ మిషన్ లో 'గగనయాన్' ఒకటి. భారతీయులను స్పేస్ లోకి పంపించాలనే సంకల్పంతో భారత్ ఈ మిషన్ కు నాంది పలుకగా వ్యోమగాములను తయారుచేయడానికి రష్యా సహకారం తీసుకొంటోంది. నలుగురు పైలట్లకు చాలా వరకూ గగారిన్ రీసర్చ్ అండ్ టెస్ట్ కాస్మోనాట్ ట్రైనింగ్ సెంటర్ లోనే ట్రైనింగ్ ఇవ్వనున్నారు. బేసిక్-జనరిక్ ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ మొత్తం అక్కడే ఇవ్వనున్నారు.

భారత్ గగనయాన్ ప్రాజెక్టులో భాగం అవ్వాలని చాలా మంది అప్లికేషన్లు పెట్టారు. వారిలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన నలుగురు ఫైటర్ జెట్ పైలట్లను ఎంపిక చేశారు. రష్యా, భారత్ లలో మొత్తం ట్రైనింగ్ పూర్తయ్యాకనే రోదసీ లోకి ఎంత మంది వెళతారు అన్నది తెలుస్తుంది. 2022లో భారత్ 'గగనయాన్' ప్రాజెక్ట్ పూర్తి చేయాలని భావిస్తోంది.

2019 జూన్ నెలలో 'హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ రీసర్చ్ ఆర్గనైజేషన్' రష్యా ప్రభుత్వం ఆధీనంలో ఉన్న గ్లావ్కాస్మోస్ సంస్థతో ఒప్పందంపై సంతకాలు చేసింది. భారత గగనయాన్ ప్రాజెక్టు కోసం రష్యా తమ పూర్తీ సహాయసహకారాలు అందిస్తామని హామీ ఇచ్చింది. అభ్యర్థుల ఎంపిక దగ్గర నుండి వారి మెడికల్ టెస్టులు, స్పేస్ ట్రైనింగ్ మొత్తం గ్లావ్కాస్మోస్ సంస్థ చూసుకోనుంది. ఈ 12 నెలల ట్రైనింగ్ లో భారత పైలట్లకు బయో మెడికల్ ట్రైనింగ్ అలాగే ఫిజికల్ ప్రాక్టీస్ కూడా ఇవ్వనున్నారు. సోయజ్ స్పేస్ షిప్ లో కూడా వీరికి ట్రైనింగ్ ఇవ్వనున్నారు. Il-76MDK ఎయిర్ క్రాఫ్ట్ సహాయంతో తక్కువ సమయంలో బరువును కోల్పోయినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలో కూడా తెలియజేయనున్నారు. ఎమర్జెన్సీ సమయాల్లో ఎలా ప్రవర్తించాలో కూడా తెలియజేయనున్నారు. స్పేస్ క్రాఫ్ట్ అన్నది ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చినప్పుడు, వాతావరణం అనుకూలంగా లేనప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నదానిపై కూడా అవగాహన కల్పించనున్నారు.

Next Story