చంద్రబాబు ఆస్తుల వివరాలన్నీ అబద్దాలే..

By సుభాష్  Published on  20 Feb 2020 1:09 PM GMT
చంద్రబాబు ఆస్తుల వివరాలన్నీ అబద్దాలే..

నారా లోకేష్ కుటుంబ ఆస్తులను ప్రకటించడంపై ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి స్పందించారు. గురువారం ఆయన తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. అవినీతికి బ్రాండ్‌ అంబాసిడర్‌ చంద్రబాబు నాయుడని, ఆయన ఆస్తులను ప్రకటించడంపై ఎన్నో అనుమానాలున్నాయని అన్నారు. లోకేష్‌ ప్రకటించిన ఆస్తుల వివరాలన్నీ అబద్దాలేనని ఆరోపించారు. ఐటీ విచారణలో అసలైన నిజాలు బయట పడతాయనే కారణంతో ఆస్తులను ప్రకటించారని శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు పీఏ ఇంట్లో దాడులు చేస్తే రూ.2వేల కోట్ల అక్రమ లావాదేవీలు బయటపడ్డాయన్నారు. చంద్రబాబు ఏడు లక్షల అవినీతికి పాల్పడ్డాడని దుయ్యబట్టారు. విదేశాల్లో ఉన్న బినామీ ఆస్తులను బయటపెట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. చంద్రబాబు మొత్తం అవినీతికి పాల్పడ్డాడని, చంద్రబాబు వంద తప్పులపై బీజేపీ చార్జీషీట్ కూడా చేసిందని గుర్తు చేశారు. అక్రమ ఆస్తులపై లక్ష్మీపార్వతి వేసిన పిటిషన్‌పై చంద్రబాబు స్టే తెచ్చుకున్నారన్నారు. అవినీతి సొమ్మును కాపాడుకునేందుకు, కేసుల కోసమే చంద్రబాబు రాష్ట్ర విభజనకు సహకరించాని ఆరోపించారు.

చంద్రబాబు జైలుకు వెళ్లక తప్పదు

భవిష్యత్తులో చంద్రబాబు జైలుకు వెళ్లక తప్పదని విమర్శించారు. రాష్ట్ర విలువలను దెబ్బతీసేందుకే చంద్రబాబు ఒక మాఫియాను సృష్టించారని మండిపడ్డారు. ప్రతినెల రూ.5 కోట్లు పెట్టి మాఫియాను నడిపిస్తున్నారని ధ్వజమెత్తారు.

త్వరలో చంద్రబాబు మాఫియాను బయటపెడతాం

త్వరలోనే చంద్రబాబు మాఫియా వివరాలు బయటపెడతామని అన్నారు. అవినీతిలో రాజ్యమేలుతున్న చంద్రబాబును ఎల్లో మీడియా కాపాడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు చేస్తున్నది జనచైతన్య యాత్ర కాదని.. బినామీలను కాపాడుకునే యాత్ర అని ఎద్దేవా చేశారు. మున్ముందు చంద్రబాబు అక్రమాలు బయటకు వస్తాయని అన్నారు.

Next Story