ఫ్రం నింబోలి అడ్డ టు రియాధ్ .... ఓ సామాన్యుడి కథ!!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  18 Nov 2019 8:21 AM GMT
ఫ్రం నింబోలి అడ్డ టు రియాధ్ .... ఓ సామాన్యుడి కథ!!

దాసాని జయప్రకాశ్... ఈ పేరు చెబితే మీకూ మాకూ పెద్దగా ఏమీ అనిపించకపోవచ్చు. కానీ రియాధ్ లో భారతీయులకు మాత్రం జయప్రకాశ్ అంటే చాలా ఇష్టం. ఆయనే కాదు. ఆయన కత్తెర అంటే కూడా చాలా ఇష్టం. తెలుగు వాళ్లంతా ఆయన దగ్గరకు వెళ్లి తలలప్పగించేస్తారు. తలపుల్లో హైదరాబాద్ గల్లీల్లో తిరుగాడేస్తూంటారు.

దాసాని జయప్రకాశ్ రియాధ్ భారతీయులకు సుపరిచితమైన పేరు. వారు హెయిర్ కట్ చేయించుకోవాలంటే ఈ భారతీయ,...అందునా పక్కా హైదరాబాదీ దగ్గరకే వస్తారు. ఆయన పెట్టుకున్న హైదరాబాద్ సెలూన్ కి అందరూ రావాల్సిందే. కత్తెర తో పాటు హైదరాబాదీ కబుర్లు పుష్కలంగా దొరుకుతాయి. కస్టమర్లకు చాదర్ ఘాట్ నుంచి చిక్కడపల్లి దాకా, తార్ నాకా నుంచి తారామతీ బారాదరీ లాగా హిమాయత్ నగర్ నుంచి హిమాయత్ సాగర్ దాకా, గోల్నాకా నుంచి గోల్కొండ దాకా వర్చువల్ టూర్ సులువుగా దొరికిపోతుంది. అల్ఫా హోటల్ చాయ్, ప్యారడైజ్ బిర్యానీ, మదీనా హోటల్ పాయా, నయాగరా హోటల్ హలీమ్ ల కబుర్లు దొర్లిపోతాయి. పనిపూర్తయిన తరువాత కస్టమర్లకు క్రాపు. జయప్రకాశ్‌ కు కాసులు.

నింబోలి అడ్డలో చిన్న సెలూన్ తో కుటుంబాన్ని కష్టంగా ఈడ్చుకొచ్చిన జయప్రకాశ్ 1985 లో రియాధ్ కు వచ్చి హైదరాబాద్ సెలూన్ ను పెట్టుకున్నాడు. కత్తెరా, క్రాపూ ఆయన కుటుంబాన్ని గట్టెక్కించాయి. రియాల్సు, దీనార్లు ఆయన కుటుంబ ఆర్ధిక స్థితిని మెరుగుపరిచాయి. ఆయన కుటుంబమంతా ఇప్పుడు హాయిగా ఉంటున్నారు. తెలుగువాళ్లకు దాసాని జయప్రకాశ్ కి చెందిన హైదరాబాద్ సెలూన్ కి వస్తే “ఏందిర భై.. ఎట్లున్నవ్... అంత మస్తుగుందా? ఏం సంగతులు?” అంటూ ఆత్మీయ పలుకులు వినిపిస్తాయి. అందుకే అది మన “పోరగాల్ల అడ్డ” అయింది.

జయప్రకాశ్ తన గల్ఫ్ జీవనంలో ఎగుళ్లూ చూశాడు. దిగుళ్లూ చూశాడు. ఆనందమూ చూశాడు. కన్నీళ్లూ చూశాడు. రియాధ్ నగరం నేనొచ్చినప్పటి నాటి నుంచి చాలా మారిపోయింది అంటాడతను. రియాధ్ నగర వికాసంలో దాసాని జయప్రకాశ్ కీ తనదైన భూమిక ఉంది. “అప్పట్లో ఇకామా (పర్మిట్) వంద రియాల్స్ కి దొరికేది. ఇప్పుడు ఇకామా కావాలంటే 8000 రియాల్స్ చెల్లించాల్సిందే.” అంటాడు జయప్రకాశ్.

హైదరాబాద్ గల్లీలనుంచి రియాధ్ వీధుల దాకా విస్తరించిన తెలుగు ఉద్యోగపర్వం లో జయప్రకాశ్ ఒక చిన్న ఉపకథ. కానీ జయప్రకాశ్ జీవితంలో మాత్రం రియాధ్ ఒక పెద్ద అధ్యాయం.

Next Story