తండ్రీ కొడుకుల హత్య: నలుగురు పోలీసుల అరెస్ట్
By సుభాష్ Published on 2 July 2020 6:25 AM GMTలాక్ డౌన్ సమయంలో 15 నిమిషాలు అదనంగా మొబైల్ షాప్ ను తెరిచారని తండ్రీకొడుకులను పోలీసులు హింసించడం.. వారు చనిపోవడం దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయింది. తమిళనాడు తూతుకూడి జిల్లా శతాంకులంలో చోటుచేసుకున్న ఈ ఘటన పట్ల పలువురు ప్రముఖులు కూడా తమ నిరసనను వ్యక్తం చేశారు. ఫెనిక్స్ చిన్న మొబైల్ షాపు నడుపుతుంటాడు. జూన్ 19వ తేదీ సాయంత్రం 8.15 వరకు షాపు తెరిచే ఉంచడంతో పెట్రోలింగ్ పోలీసు ఫెనిక్స్‌ను బయటకు లాగాడు. పోలీసుకు, ఫెనిక్స్ మధ్య చిన్న వాగ్వాదం జరిగింది. తర్వాతి రోజు షాపుకు వచ్చిన పోలీసులు ఫెనిక్స్ తండ్రి జయరాజ్‌తో గొడవపడి అతడిని స్టేషన్‌కి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న ఫెనిక్స్ పోలీస్ స్టేషన్‌కి వెళ్లగా అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పోలీసు కస్టడీలో జయరాజ్, ఫెనిక్స్‌లను పోలీసులు తీవ్రంగా హింసించారు. చివరికి వారిరువురూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. 21వ తేదీ నాటికి జయరాజ్, ఫెనిక్స్ తీవ్రంగా అస్వస్థతకు గురవ్వడంతో వారిని కోవిల్‌పట్టి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 22వ తేదీ సాయంత్రం ఆసుపత్రిలో ఫెనిక్స్ మృతి చెందగా, 23వ తేదీ ఉదయం జయరాజ్ మృతిచెందాడు.
ఈ ఘటన పట్ల తమిళనాడు మొత్తం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. దక్షిణాదికి చెందిన పలువురు ప్రముఖులు ఈ దారుణాన్ని తీవ్రంగా ఖండించారు. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిసామి దీనిపై సిబిఐ విచారణ చేయడానికి అనుమతులు ఇచ్చారు. సిబిఐ ఈ కేసును విచారించే వరకు సిఐడి బాధ్యతలు తీసుకుంది. వీరిద్దరి మరణాలకు బాధ్యులుగా ఆరోపిస్తూ నలుగురు పోలీసులను తమిళనాడు క్రైం బ్రాంచ్ సిఐడి అరెస్ట్ చేసింది. ఇన్స్పెక్టర్ శ్రీధర్, సబ్ ఇన్స్పెక్టర్లు రఘు గణేష్, బాలకృష్ణన్, కానిస్టేబుల్ మురుగన్ ని అదుపులోకి తీసుకున్నారు. వీరిపై పలు సెక్షన్ల కింద కేసులను నమోదు చేశారు.
మద్రాసు హైకోర్టు కూడా ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఈ దారుణానికి సంబంధించిన పోలీసుల ఇన్వెస్టిగేషన్ సజావుగా సాగలేదని తెలిపింది. ఈ కేసులో ప్రత్యక్ష సాక్షి అయిన హెడ్ కానిస్టేబుల్ కు అతడి కుటుంబానికి సెక్యూరిటీ ఇవ్వాలని కోరింది.