డ్రంక్‌ డ్రైవ్‌లో పట్టుబడిన క్రికెటర్‌..

By Newsmeter.Network  Published on  5 March 2020 10:40 AM GMT
డ్రంక్‌ డ్రైవ్‌లో పట్టుబడిన క్రికెటర్‌..

కివీస్‌ మాజీ క్రికెటర్‌ జెస్సీ రైడర్‌ చేజేతులా తన కెరీర్‌ నాశనం చేసుకున్నాడు. క్రమశిక్షణాలేమితో న్యూజిలాండ్‌ జట్టుకు దూరం అయ్యాడు. క్రికెట్‌కు దూరమైన ఈ మాజీ ఆటగాడిలో మార్పు రాలేదు. ఇటీవల పూటుగా మద్యం తాగి కారు నడుపుతూ పోలీసులకు చిక్కాడు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్టులో మోతాదుకి మించి మద్యం సేవించినట్లు రావడంతో అక్కడి పోలీసులు కేసు నమోదు చేసి సదరు ఆటగాడిని కోర్టులో ప్రవేశపెట్టారు. ఇలా డ్రంక్ అండ్ డ్రైవ్‌లో జెస్సీ రైడర్ పట్టుబడటం ఇది మూడోసారి.

కివీస్‌ తరుపున 2008లో అరగ్రేటం చేసిన ఈ లెఫ్ట్‌హ్యాండ్‌ బ్యాట్స్‌మెన్‌.. 18టెస్టులు, 48 వన్డేలు, 22 టీ20ల్లో కివీస్‌కు ప్రాతినిథ్యం వహించాడు. టెస్టుల్లో 3, వన్డేల్లో 3 శతకాలు బాదాడు. కెరీర్ ఆరంభం నుంచి నిత్యం వివాదాలతోనే దోస్తి చేశాడు. అర్థరాత్రి వరకు మద్యం సేవించడం.. తెల్లారి టీమ్‌ మీటింగ్స్‌, ప్రాక్టీస్‌ సెషన్స్‌కి డుమ్మా కొట్టడం వంటి పనులు చేస్తుండేవాడు. దీంతో టీమ్‌మేనేజ్‌మెంట్‌ ఎన్నో సార్లు సదరు ఆటగాడిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. అయినా జెస్సీలో మార్పు రాలేదు. న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు అప్పటి సీఈవో జస్టిన్ వాగన్ స్వయంగా జెస్సీ రైడర్‌లో మార్పు తెచ్చే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది.

దీంతో జెస్సీని జాతీయ జట్టుకు దూరం పెట్టారు. 2014లో భారత జట్టు పై చివరిసారి వన్డే ఆడాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్లీ న్యూజిలాండ్‌ జెర్సీలో అతను కనిపించలేదు. ఇక టెస్టుల్లో మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేసిన జెస్సీ రైడర్.. వన్డేల్లో మాత్రం ఓపెనర్‌గా ఆడాడు. తన దూకుడైన బ్యాటింగ్‌తో కివీస్‌కు శుభారంభాలు అందించేవాడు. ఒక బ్యాట్స్‌మెన్‌గానే కాక.. మీడియం పేస్‌ బౌలింగ్‌ చేసేవాడు. ప్రతిభావంతమైన ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్నప్పటికి క్రమశిక్షణాలేమితో అర్థాంతరంగా కెరీర్‌ను ముగించాల్సి వచ్చింది. మొత్తంగా.. ఇలా డ్రంక్ అండ్ డ్రైవ్‌లో జెస్సీ రైడర్ పట్టుబడటం ఇది మూడోసారి.

Next Story