చెట్లు కొట్టినందుకు రూ.53 వేల ఫైన్..

By Newsmeter.Network  Published on  28 Feb 2020 1:23 PM GMT
చెట్లు కొట్టినందుకు రూ.53 వేల ఫైన్..

కూకట్‌పల్లిలోని ఓ గేటెడ్‌ కమ్యూనిటీకి అటవీ శాఖ రూ.53,900 జరిమానా విధించింది. అనుమతి లేకుండా చెట్లు కొట్టేయడంతో.. అటవీశాఖ భారీ ఫైన్‌ విధించడంతో పాటు రెట్టింపు సంఖ్యలో మొక్కలు నాటాలని ఆదేశించింది.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కూకట్‌పల్లిలోని ‘ఇందు ఫార్చ్యూన్ ఫీల్డ్’ గేటెడ్ కమ్యూనిటీలో 40 చెట్లను కొట్టివేశారు. ఈ విషయం అటవీ అధికారుల దృష్టికి వచ్చింది. మేడ్చల్ జిల్లా అటవీ అధికారి సుధాకర్ రెడ్డి.. తన సిబ్బందితో అక్కడికి వెళ్లి పరిశీలించారు. అనుమతి లేకుండా చెట్లను కొట్టేశారని నిర్థారించారు. వాల్టా చట్టం అతిక్రమణ కింద రూ.53,900 అపరాధ రుసుము విధించారు. రెట్టింపు సంఖ్యలో అంటే(80) చెట్లను నాటి సంరక్షించాలని షరతు పెట్టారు.

ఇదిలా ఉంటే.. కమ్యూనిటీలో అదనపు సౌకర్యాల కల్పన కోసం చెట్లు కూల్చాల్సి వచ్చిందని గేటెడ్ కమ్యూనిటీ నిర్వాహకులు వివరణ ఇచ్చారు. కొట్టేసిన చెట్లను ట్రాన్స్‌లొకేట్ చేశామని చెప్పారు. అయితే.. అధికారుల దర్యాప్తులో అది శాస్త్రీయంగా జరగలేదని వెల్లడైంది.

Next Story