విమానం కూలిందా..? కూల్చారా..?

By సుభాష్  Published on  11 Jan 2020 12:26 PM IST
విమానం కూలిందా..? కూల్చారా..?

ముఖ్యాంశాలు

  • క్షిప‌ణితో కూల్చేశార‌ని అనుమానం

  • లోతుగా విచార‌ణ ద‌ర్యాప్తు

  • క్షిప‌ణితో కూల్చేశార‌న్న ఉక్రేయిన్‌

  • ఉగ్ర‌వాదులు పేల్చేశారా..?

టెహ్రాన్‌ లో బుధవారం తెల్లవారుజామున ఉక్రెయిన్‌కు చెందిన బోయింగ్‌ 737 విమానం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ విమానంలో 180 మంది ప్రయాణికులు మృతి చెందారు. ఈ ప్రమాదంపై భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. విమానం సాంకేతిక కారణాలతోనే కుప్పకూలిందని ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది. విమానం టెకాఫ్‌ అయిన కొన్ని నిమిషాల్లోనే మంటలు అంటుకున్నాయని, దీంతో విమానాన్ని పైలట్‌ తిరిగి ఎయిర్‌పోర్టుకు తీసుకొస్తుండగా కూలినట్లు వెల్లడించింది. ఈ వాదనను ఉక్రెయిన్‌ తోసిపుచ్చింది. తమ విమానంపై క్షిపణి లేదా ఉగ్రదాడి జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తోంది. ఇక అమెరికా మరో అనుమానం వ్యక్తం చేసింది. ఆ విమానాన్ని పొరపాటున ఇరానే కూల్చివేసి ఉంటుందని పేర్కొంది. మరో వైపు ఇరాక్‌ రాజధాని అయిన బాగ్దాద్‌లో అమెరికా రాయబారి కార్యాలయం ఉండే గ్రీన్‌ జోన్‌లో రెండు క్షిపణులు వచ్చిపడ్డాయి. వీటిని ఇరానే ప్రయోగించిందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.

ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌ నుంచి ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌కు వెళ్తున్న విమానం బుధవారం తెల్లవారుజామున కూప్పలిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంపై ఇరాన్‌ అంతర్గత విచారణకు ఆదేశించింది. పౌర విమానయాన శాఖ అధికారులు విచారణ జరిపి గురువారం నివేదిక అందించారు. ఉక్రెయిన్‌ విమానం టెహ్రాన్‌లోని ఇమామ్‌ ఖమేనీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దాదాపు గంట ఆలస్యంగా బుధవారం ఉదయం 6.12 గంటలకు టేకాఫ్‌ అయింది. పడమర దిశగా దాదాపు 8 వేల అడుగులు వెళ్లిన తర్వాత ఆకస్మాత్తుగా కుడివైపు తిరిగిపోయింది. ఈ తర్వాత ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్స్‌ తో సంబంధాలు తెగిపోయాయి. పైలట్‌ సైతం సహాయం కోసం ఎలాంటి రేడియో కాల్‌ చేయలేదని తెలుస్తోంది. ఇక 6.18 గంటలకు విమానం విమానాశ్రయం సమీపంలో కుప్పకూలిపోయింది.

గాలిలో ఉండగానే మంటలు అంటుకున్నాయా..?

అదే సమయంలో అటుగా వెళ్తున్న మరో విమానం ప్రయాణికులు, సిబ్బంది ఉక్రెయిన్‌ విమానం గాలిలో ఉండగానే మంటలు అంటుకున్నాయని చెప్పారని నివేదికలో వెల్లడించారు. ఇంధనం నిండుగా ఉండటంతోనే భూమిని ఢీకొట్టగానే పెద్ద ఎత్తున పేలుడు సంభవించిందని పేర్కొంది. ఇక విమానం నుంచి సేకరించిన బ్లాక్‌ బాక్స్‌ లు కొంత మేర ధ్వంసమయ్యాయని, దీంతో వాటిలోని కొంత సమాచారం నాశనం అయిందని తెలిపింది. ఇక లేజర్‌ లేదా విద్యుదయస్కాంత తరంగాల వల్ల విమానం కూలిపోయిందన్న ఆరోపణలను నివేదిక తోసిపుచ్చింది.

ఇక క్షిపణి దాడి వల్లే తమ విమానం కూలిపోయి ఉంటుందని ఉక్రెయిన్‌ అనుమానం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో విమాన ప్రమాదం, క్షిపణి దాడి సహా అనేక కోణాల్లో విచారణ జరుపుతున్నామని ఉక్రెయిన్‌ జాతీయ భద్రత సంఘం కార్యదర్శి ఒలెక్సీ డానిలోవ్‌ మీడియాకు వెల్లడించారు. టోర్‌ మిస్సైల్‌ సిస్టమ్‌కు చెందిన క్షిపణి విమానాన్ని ఢీకొట్టి ఉండవచ్చనే అనుమానాలు ఉన్నాయని అన్నారు. ఇక విమానం కూలిపోయిన ప్రాంతంలో ఈ క్షిపణుల ఆనవాళ్లు ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు

ఉగ్ర‌వాదులు పేల్చేశారా..?

మరో వైపు ఉక్రెయిన్‌కు చెందిన 45 మంది నిపుణులతో కూడిన ఓ బృందం టెహ్రాన్‌కు చేరుకుంది. కాగా, ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్లి దర్యాప్తు చేసేందుకు ఇరాన్‌ అనుమతి కోసం వేచి ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అనుమతి రాగానే వారు బ్లాక్‌ బాక్స్‌ లను పరిశీలించనున్నారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు డ్రోన్‌ లేదా ఎగిరే పరికరాలతో విమాన ఇంజన్‌ను ఢీకొట్టి ఉంటారనే కోణంలో కూడా విచారణ చేపడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.

లోతుగా దర్యాప్తు చేపట్టాలి

ఈ ఘటనపై పూర్తి దర్యాప్తు చేసి వాస్తవాలను బయటకు తీయాలనేది తమ లక్ష్యమని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పేర్కొన్నారు. ఉక్రెయిన్‌ ఆరోపణలపై ఇరాన్‌ ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. కాగా, క్షిపణి దాడిలో విమానం కూలిందని మీడియాలో వస్తున్న వార్తలను ఇరాన్‌ సైన్యం అధికారి ప్రతినిధి జనరల్‌ అబోల్‌ ఫజల్‌ ఖండించారు.

మృతుల్లో 136 మంది కెనడాకు చెందిన వారే..

ఇక కుప్పకూలిన ఉక్రెయిన్‌ విమాన ప్రమాదంలో మృతి చెందిన వారిలో 136 మంది ప్రయాణికులు కెనడాకు వస్తున్నవారేనని కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో ఆవేదన వ్యక్తం చేశారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉన్నారని చెప్పారు. కెనడాతో సంబంధం ఉన్న విమాన ప్రమాదాల్లో ఇదే అతిపెద్దదని పేర్కొన్నారు. ఈ ప్రమాదంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరపాలని కోరారు. మరో వైపు ప్రమాదం నేపథ్యంలో కెనడా పార్లమెంట్‌ పై జాతీయ జెండాను అవనతం చేశారు. మృతుల్లో అత్యధికులు కెనడాలోని వివిధ యూనివర్సిటీల్లో చదువుతున్న విద్యార్థులేనని ఓ నివేదిక పేర్కొంది. శీతాకాలం సెలవుల అనంతరం వారందరూ టొరంకు తిరుగు ప్రయాణమయ్యారని వెల్లడించారు.

ఇక ఉక్రెయిన్‌ విమానాన్ని ఇరానే క్షిపణితో కూల్చివేసి ఉంటుందని అమెరికా అనుమానం వ్యక్తం చేస్తోంది. ఇరాక్‌లో తమ ఎయిర్‌ బెస్‌లపై దాడి జరిగిన కొన్ని గంటల్లోనే విమానం కూలిపోయిందని అమెరికా గుర్తు చేసింది. విమానాన్ని ఇరానే క్షిపణితో కూల్చివేసి ఉంటుందని అమెరికా చెబుతోంది.

ట్రంప్ ఏమంటున్నారు..

ఇరాక్‌లోని తమ సైనిక స్థావరాలపై దాడి జరిగిన కొన్ని గంటల్లోనే విమానం కూలిపోయిందని అమెరికా గుర్తు చేసింది. సాంకేతిక కారణాలతోనే కూలిపోయిందని కొందరు చెబుతున్నారని, కానీ నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మనని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మీడియా ముందు చెప్పుకొచ్చారు. ఇది అనుమానం మాత్రమేనని చెప్పారు. అలాగే అమెరికా రక్షణశాఖకు చెందిన ఇద్దరు అధికారులు మాట్లాడుతూ.. ఇరాన్‌కు చెందిన టోర్‌ ఎం-1 క్షిపణి వ్యవస్థ దాడి వల్లే విమానం కూలిపోయిందన్నారు. విమానం కూలడానికి కొన్ని నిమిషాల ముందే రాడార్‌ సిగ్నల్స్‌ ఆన్‌ చేసినట్లు తమనిఘా వ్యవస్థ గుర్తించిందన్నారు. అదే విధంగా ఉపరితలం నుంచి అకాశంలోకి ప్రయోగించగలిగే ఓ క్షిపణిని ప్రయోగించినట్లు తమనిఘా ఉపగ్రహం గుర్తించిందని పేర్కొన్నారు. అయితే పొరపాటున మాత్రమే విమానం కూల్చి ఉంటారని వారు అభిప్రాయపడ్డారు.

Next Story