ఏపీలో ఐదుకు చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు.. అనంతపురంలో కరోనా కలకలం..

By Newsmeter.Network  Published on  22 March 2020 5:57 AM GMT
ఏపీలో ఐదుకు చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు.. అనంతపురంలో కరోనా కలకలం..

కరోనావైరస్‌ ప్రపంచ దేశాలను భయపెడుతుంది. ఈ వైరస్‌ భారిన పడిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్‌ భారిన పడి 11,576 మంది మృతి చెందగా.. 2,78, 840 మంది ఈ వైరస్‌ భారిన పడి చికిత్స పొందుతున్నారు. భారత్‌లోనూ ఈవైరస్‌ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పటికే భారత్‌లో 324 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇదిలాఉంటే తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ వైరస్‌ ప్రభావం తీవ్రంగానే కనిపిస్తుంది. తెలంగాణలో ఇప్పటికే 21 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా పదుల సంఖ్యలో అనుమానితులను ఐసోలేషన్‌ కేంద్రాలకు తరలించారు. ఏపీలో నిన్నటి వరకు మూడు పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. వాటి సంఖ్య ఐదుకు పెరిగింది. తూర్పు గోదావరి జిల్లాలో ఒకరు, విజయవాడలో ఒకరికి ఈ వైరస్‌ సోకినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

కృష్ణాజిల్లా విజయవాడకు చెందిన విద్యార్థి (24) పీజీ చదువుకునేందుకు ప్యారిస్‌ వెళ్లాడు. అక్కడి నుండి ఈనెల 15న ఢిల్‌లకి వచ్చాడు. 17న హైదరాబాద్‌కు, అక్కడి నుండి కారులో విజయవాడకు చేరుకున్నాడు. కరోనా వైరస్‌ లక్షణాలతో ఈ నెల 20న ఆస్పత్రిలో చేరగా, శనివారం కరోనా పాజిటివ్‌గా ధ్రువీకరించారు. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్ర వరానికి చెందిన విద్యార్థి (22) లండన్‌లో పీజీ చేస్తున్నాడు. ఈ నెల 18న లండన్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చి అక్కడి నుండి రాజమహేంద్రవరానికి వచ్చాడు. 20న కరోనా వ్యాధి లక్షణాలతో ఆస్పత్రిలో చేరగా శనివారం కరోనా పాజిటివ్‌గా వైద్యులు నిర్దారించారు. వీరికి ప్రత్యేక చికిత్సలు అందిస్తున్నారు. ఇదిలా ఉంటే వీరి కుటుంబ సభ్యులను అధికారులు స్వీయ గృహనిర్బంధంలోకి పంపించారు. వీరికి కరోనా వైరస్‌ పరీక్షలు చేయనున్నారు.

మరోవైపు విజయవాడలో పాజిటివ్‌ కేసు నమోదు కావడంతో జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ విజయవాడలో హై అలెర్ట్‌ ప్రకటించారు. జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. హుఆహుటీన జిల్లా ఉన్నతాధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ భేటీకి జేసీ మాధవీ లత, మున్సిపల్‌ కమిషనర్‌ ప్రసన్న వెంకటేష్‌, డీసీసీ విక్రాంత్‌ పాటిల్‌ తదితరులు హాజరయ్యారు. కరోనా పాజిటివ్‌ నమోదు కావటంతో సంబంధిత ప్రాంతాల్లో హై అలెర్ట్‌ ప్రకటించి, పాజిటివ్‌ కేసు బాధిత ప్రాంతాల్లో పలువురికి పరీక్షలు చేయాలని నిర్ణయించారు.

అనంతపురంలోనూ కరోనా కలకలం రేగింది. అనంతపురం రైల్వే స్టేషన్‌లో ఆరుగురు కరోనా వైరస్‌ సోకిన అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీహార్‌ నుంచి ఆరుగురు యువకులు జబల్‌ పూర్‌ - యశ్వంతపూర్‌ రైల్‌లో అనంతపురం చేరుకున్నారు. తనిఖీలు చేసిన పోలీసులు ఆ ఆరుగురు యువకులకు కరోనా అనుమానిత లక్షణాలుండటంతో అదుపులోకి తీసుకున్నారు. వారిని వైద్య పరీక్షల నిమిత్తం అనంతపురం సర్వజన ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం జనతా కర్ఫ్యూ ఉండటంతో ఇండ్లనుంచి ఎవరూ బయటకు రాలేదు. ఏపీలోని అన్ని ప్రాంతాల్లో రహదారులు నిర్మానుష్యంగా మారాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలను అధికారులు చెక్‌ పోస్టుల్లోనే నిలిపివేస్తున్నారు.

Next Story