అలలపై మహిళల ఉపాధి వేట..!

By మధుసూదనరావు రామదుర్గం  Published on  30 Aug 2020 9:52 AM GMT
అలలపై మహిళల ఉపాధి వేట..!

ఉపాధి వేటలో ఆ మహిళలు సాగర సాహస దారుల్లో వెళుతున్నారు. అలలపై ఊగే పడవల్లో ప్రయాణాస్తూ చేపల్ని వేటాడుతున్నారు. సాగరంలో ఇలా ఎదురీదడమంటే ప్రాణాలను పణంగా పెట్టడమేనని వారికి తెలుసు. అయితే అప్పటిదాకా చేపల వేటకు వెళ్ళాల్సింది మగవాళ్ళే అన్న సంప్రదాయానికి తెరదించారు. తామూ అలలపై వలలు వేసి చేపల్ని ఒడిసిపట్టుకుంటున్నారు. ఆఫ్రికాలోని మొరాకో తీరంలోని ఓగ్రామంలో మహిళాశక్తుల కథనం ఇదీ..

తెల్లారుజామునే తమ వంటపనులు ముగించుకుని సముద్రం వైపు అడుగులేస్తుంటారు ఫతిహా నజీ, ఫాతిమా మెఖ్నాన్, అమినీ మెఖ్నాన్, సైదాలు. సముద్రం చెంతకు చేరి అక్కడ తమ కోసం ఎదురు చూస్తున్న పడవను ఎక్కి సాగరంలోకి వెళతారు. సాయంత్రం అయ్యేదాకా నిర్విరామంగా చేపల కోసం అన్వేషిస్తునే ఉంటారు. సాయంత్రం వారు చేపలతో ఒడ్డుకు చేరుకుంటారు. ఇదే వీరి దినచర్య. బతుకు బాటలో లింగ»ే ధాలు ఏంటని వీరు ఆచరణాత్మకంగా నిరూపిస్తున్నారు. మధ్యదరా సముద్ర తీరాన ఉన్న బెలియానెచ్‌ వీరి గ్రామం. ఈ మహిళలు మొరాకోలో మొదటి మహిళాజాలర్లుగా పేరు తెచ్చుకున్నారు.

ఈ గ్రామానికి ఏడు కిలోమీటర్ల దూరంలో మొరాకో, యూరప్‌ సరిహద్దు ప్రాంతం స్పెయిన్‌ పట్టణం సెవుటా ఉంది. మొదట్లో ఈ గ్రామంలోని మగవాళ్ళు సెవుటాలో పనిచేసేవారు. రోజూ సరిహద్దు దాటి వెళ్ళి సాయంత్రం కాగానే ఊరు చేరుకునే వారు. అయితే 2000 సంవత్సరంలో స్పెయిన్‌ తన సరిహద్దుల్ని మూసేయడంతో వీరి ఉద్యోగాలు ఊడాయి. ఉపాధి కరవైంది. ఇక చేసేది లేక తమ తాతల నాటి వృత్తి అయిన జాలరి వృత్తి చేపట్టారు.

‘నేను సెవుటాలో ఆయాగా పనిచేసేదాన్ని. రోజుకు 20 యూరోలు వచ్చేవి. దీతో కుటుంబం సజావుగా సాగిపోయేది. అయితే సరిహద్దు మూసేశాక ఇంటిపట్టునే ఉండిపోయా. ఏళ్ళకు ఏళ్లు ఇంట్లోనే ఉన్నా. ఈ కిటికీలోంచి సముద్రాన్ని చూస్తుండపోయా’ అంటూ ఆవేదనగా చెబుతుంది 60 ఏళ్ళ ఖేడౌజ్‌ ఘాజిల్‌. ఖాళీ సమయాల్లో ఘాజిల్‌ మరి కొందరు సముద్రం ఒడ్డున ఉండే పడవలను శుభ్రం చేయడం, వలల్ని మరమ్మతులు చేయడం నేర్చుకున్నారు.

ఆ సమయంలోనే స్థానిక మహిళలకు ఉపాధి కల్పించే యోచనలో 2018లో అక్కడి సహకార సంఘం 8 మంది మహిళలతో జాలర్ల బృందం ఏర్పాటు చేసింది. వీరిలో కొందరికి మాత్రమే చేపలు పట్టడం తెలుసు. కానీ చాలా మందికి పడవల్ని శుభ్రం చేయడం, వలల్ని మరమ్మతు చేయడం, భర్తలకు వేటలో సాయం చేయడం, చేపల్ని మార్కెట్లో అమ్మడం లాంటి పనులే చేసేవారు. వీరికి సహకార సంఘం సముద్రంలో చేపల్ని పట్టేలా శిక్షణనిచ్చింది. రెండేళ్ళ పాటు ఈ శిక్షణ కొనసాగింది. ఈ శిక్షణలో భాగంగా అలలపై పడవలో ప్రయాణించడం, ప్రథమ చికిత్స, ఒకవేళ తెప్ప మునిగపోతే నీళ్ళలో దూకి ఒడ్డుకు ఈదడం తదితర అంశాల్లో బాగా తర్ఫీదునిచ్చారు.

‘మా జీవితం నుంచి ఈ సముద్రాన్ని వేరు చేయలేం. ఒకవేళ వేరు చేస్తే మేం కూడా చేపల్లా విలవిల్లాడిపోతాం... సముద్రంలో చేపల్ని వేటాడ్డం అంత సులువు కాదు. కానీ నేను మా సహచరులు ఈ ఆలోచనను నిజం చేశాం’ సహకార సంఘం అధ్యక్షురాలు ఫాతిమా అంటోంది.

‘ఆడవాళ్ళు ఇలా సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్ళడం మా ఊరి మగవాళ్ళకు ఇష్టం ఉండదు. మొదట్లో నేను చాలా అవమానాలు ఎదుర్కొన్నాను. చివరికి మార్పు అనివార్యమన్న విషయం వారికీ అర్థమైంది.‘ అంటూ తన గతాన్ని నెమరు వేసుకుంది ఫాతియ నాన్జి.

గడ్డుకాలంలోనూ అవకాశాలు వస్తుంటాయి. వాటిని గుర్తించడం.. అందుకోవడంలోనే విజయం దాగుంటుంది. స్పెయిన్‌ సరిహద్దు మూసేశాక సెవుటాలో ఉపాధి కోల్పోయి బెలియానెచ్‌కు తిరిగి వచ్చేశాక.. అప్పటి దాకా ఇంటి పట్టునే ఉన్న మహిళలు సముద్రం వైపు చూడాల్సి వచ్చింది. రెండేళ్ళ కష్టంతో వారు కొత్త ఉపాధినే కాదు.. కొత్త జీవితాన్ని వెతుక్కొన్నారు. చెంతనే ఉన్న సముద్రం వారి పాలిట వరాలిచ్చే కల్పవృక్షమైంది. ఈ ఆలోచనే రాకపోయుంటే బెలియానెచ్‌ ఊరు ఇంకా సెవుటా వైపే ఆశగా ఆర్తిగా చూడాల్సి వచ్చేది. ఒక అయిడియా జీవితాన్నే మార్చేస్తుందంటే ఇదేనేమో!!

Next Story