పుట్టినరోజు వేడుకలకు, పెళ్లి వేడుకకు, లేదా పిల్లలకు సంబంధించిన ఫంక్షన్లకో..ఇంట్లో వారెవరైనా స్వర్గస్తులైతేనో..పండుగ- పబ్బాలకు ఇలా సందర్భాన్ని ఫ్లెక్సీలు వేస్తారు. లేదంటే రాజకీయ నాయకులకు సంబంధించిన ఫ్లెక్సీలు, ఏదైనా బట్టల దుకాణం, నగల దుకాణాలకు సంబంధించిన యాడ్స్ ఫ్లెక్సీలను పెడతారు. ఇదంతా జనానికి సహజంగానే తెలుసు.

పెళ్లి అవ్వగానే వరుడు ఎప్పుడెప్పుడు శోభన ముహూర్తం పెడతారా అని ఎదురుచూస్తుంటాడు. ఈ విషయాన్ని అతను అందరికీ చెప్పుకోలేకపోయినప్పటికీ..మనసులోనే అనుకుంటూ ముసి ముసి నవ్వులు నవ్వుకుంటుంటాడు. చిలిపి ఆలోచనలతో..కొత్తగా తన జీవితంలోకి వచ్చిన భార్య గురించి ఆలోచిస్తూ ఆ ముహూర్తం వచ్చేంత వరకూ కలల్లో విహరిస్తుంటారు.

First Night Wishing Poster 2మనకు వెపకాయ వెర్రి ఉంటుందనేది నానుడిలో ఉంది. కానీ అతనికి, అతడి స్నేహితులకు ఏకంగా పుచ్చకాయంత వెర్రి ఉన్నట్లుంది. కొత్తగా పెళ్లి చేసుకున్న ఆ యువకుడిని స్నేహితులు బాగా ఆటపట్టించారు. అంతవరకూ ఓకే గానీ..ఏకంగా ఫస్ట్ నైట్ ఫ్లెక్సీని ఏర్పాటు చేసేశారు. శోభనం కోసం ఎన్నాళ్ల నుంచి ఎదురుచూస్తున్నాడో ఏమో గానీ..శోభన మహోత్సవం జరుపుకుంటున్నాడని తన స్నేహితుల ద్వారా ఊరంతా ఫ్లెక్సీలు వేయించి తెలియజేశాడు. ఇది వేరే ఏదో రాష్ర్టంలో జరిగిందనుకుంటే పొరపాటే. సంప్రదాయాలకు నెలవైన తెలుగు రాష్ర్టంలో..అందునా తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన సంఘటన ఇది. తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో రెండ్రోజుల క్రితం వెలుగుచూసిందీ ఘటన.

శోభన మహోత్సవం ఫ్లెక్సీలో ఇలా..
కుమార్ (పేరు మార్చబడింది) అనే నేను నేటితో నా బ్రహ్మచారి జీవితానికి సంప్రదాయ బద్ధంగా స్వస్థి పలికి ఎన్నాళ్ళ నుంచో ఎదురుచూస్తున్న తొలిరేయి అనుభవానికి తహతహలాడుతూ యుద్ధానికి సిద్ధమైన బాహుబలి వలె ఈరోజు జరిగే రాత్రి యుద్ధాన్ని ముహూర్త సమయానికి ప్రారంభించి అతి తక్కువ సమయంలోనే నా తల్లిదండ్రులను నానమ్మ – తాతయ్యలను చేస్తానని అంత:కరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాను.

ఇలా ఊరంతా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చూసిన ఊరి జనం..నెటిజన్లు ‘‘యుద్ధం నువ్వు చేస్తే.. ఊరంతా ప్రచారం ఎందుకు బాబు’’ అని కామెంట్లు చేస్తున్నారు. కొందరైతే ఆ బాబు బాగా కరువుతో ఉన్నాడు కాబోలని అని సెటైర్లు పేలుస్తున్నారు. ఈ ఘటనను చూసి స్ఫూర్తి పొందిన వారెవరైనా..మున్ముందు ఏకంగా ఫేస్ బుక్ లైవ్ పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

ఇలాగే గతంలోనూ పోస్టర్లు వెలిశాయి. శోభన మహోత్సవ ఆహ్వానమని, యుద్ధానికి సిద్ధం అని..పోస్టర్లు పెట్టారు. పైగా మా ఇంటిలో రాత్రంతా ఈ వేడుక జరుగుతుందని సిగ్గులేకుండా బహిరంగంగా చెప్పుకున్నారు. చెప్పుకున్నవాడి సంగతి అటుంచితే..అతడిని పెళ్లి చేసుకున్న అమ్మాయి ఇక ఆ ఊరిలో తలెత్తుకోలేదు కదా. ఈ ఒక్క లాజిక్ ఎలా మిస్ అయ్యారో ఈ పెళ్లి కుమారుళ్లు..

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.