నెల్లూరులో తొలి కరోనా మరణం..వైద్యుడి నుంచి ముగ్గురికి కరోనా

By రాణి  Published on  12 April 2020 9:46 PM IST
నెల్లూరులో తొలి కరోనా మరణం..వైద్యుడి నుంచి ముగ్గురికి కరోనా

నెల్లూరులో తొలి కరోనా పాజిటివ్ మరణం నమోదైంది. ఇటీవలే విదేశాల నుంచి నగరానికి వచ్చిన ఆర్థోఫెట్ డాక్టర్ కు కరోనా సోకడంతో చెన్నై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే ఇటీవలే విదేశాల నుంచి వచ్చిన డాక్టర్ 2వ తేదీన స్థానికంగా ఓ ఆస్పత్రిని ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి స్థానిక మంత్రితో పాటు ప్రముఖులు, వైద్యులు కూడా హాజరయ్యారు. ఆ కార్యక్రమం తర్వాతే డాక్టర్ తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో చేరగా..అతడికి కరోనా పరీక్షలు చేశారు.

Also Read : అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా

వైద్యుడికి కరోనా పాజిటివ్ తేలడంతో ఐసోలేషన్ లో చికిత్స అందించారు. అయినా ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పులు రాకపోగా మరింత విషమించడంతో హుటాహుటిన చెన్నైలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు మృతి చెందినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించగా..వైద్యుడి మరణాన్ని ఏపీ ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించింది. మృతుడిని స్వస్థలానికి తీసుకొచ్చే అవకాశాలు లేని నేపథ్యంలో చెన్నైలోనే దహన సంస్కారాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. కాగా..మృతుని భార్య , ల్యాబ్ టెక్నీషియన్ తో పాటుగా డ్రైవర్ కు కూడా కరోనా పాజిటివ్ రావడంతో జిల్లావాసులంతా ఆందోళనలో ఉన్నారు. ఈ ముగ్గురి ద్వారా వైరస్ ఎంతమందికి వ్యాపించి ఉంటుందోనని అధికారులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో మొత్తం 420 కరోనా కేసులుండగా 12 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 7కు పెరిగింది.

Also Read : ఎలక్షన్ కమిషనర్ కు క్వారంటైన్ వర్తించదా ?

Next Story