ముఖ్యాంశాలు

  • కేరళను భయంకరంగా వణికిస్తున్న కరోనా భయం
  • విద్యార్థికి చేయించిన వైద్య పరీక్షలద్వారా నమోదైన మొదటికేసు
  • పుణే ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి రక్త నమూనాలు
  • కేరళ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఐసోలేటెడ్ వార్డులు
  • కోస్ట్ గార్డ్ అధికారుల ప్రత్యేక పర్యవేక్షణలో ఈ క్యాంప్
  • వుహాన్ నుంచి వచ్చిన 324 మందిలో 40 మంది కేరళైట్లు
  • స్పెషల్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన కేరళ హెల్త్ మినిస్ట్రి
  • ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్న కేరళ హెల్త్ మినిస్టర్ కేకే శైలజ

కేరళకు కరోనా వచ్చింది. అవును మీరు విన్న విషయం, చదివిన విషయం నిజమే. కేరళలో హీనపక్షం 1,471 మంది కరోనా వైరస్ సోకినట్టుగా భావిస్తున్న అనుమానితుల జాబితాలో ఉన్నారు. ఓ కేస్ ఇప్పటికే కన్ ఫర్మ్ అయ్యిందని అధికారులు తేల్చేశారు. త్రివేండ్రంలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరీ కేరళ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కెకె శైలజ ఈ వివరాన్నింటినీ పూసగుచ్చినట్టు వివరించారు.

కేరళలో కరోనా వైరస్ సోకినట్టుగా నిర్ధారణ అయిన విద్యార్థి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడనీ, అతని ఆరోగ్యం నిలకడగానే ఉందని హెల్త్ మినిస్టర్ శైలజ తెలిపారు. కేవలం ఆ విద్యార్థికి తప్ప అనుమానితుల్లో రక్త పరీక్షలు చేయించుకున్నావారెవరికీ కరోనా సోకిన దాఖలాలు కనిపించలేదని ఆమె చెప్పారు. ఇప్పటికే జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్న 1471 మందిలో కేవలం 50 మంది మాత్రమే ఆసుపత్రులకు వచ్చారు. వాళ్లకు వైద్య పరీక్షలు చేయించిన తర్వాత కరోనా లేదని నిర్థారించారు. మరో 1421 మంది మాత్రం ఇంకా హాస్పిటళ్లకు రాలేదు. ఇళ్లలోనే ఉన్నారు. వీరిలో 39మందికి సంబంధించిన రక్త నమూనాలను పుణేలోని వైరాలజీ ఇనిస్టిట్యూట్ కి పరీక్షల నిమిత్తం పంపించారు. వాటిలో 15 మందికి సంబంధించిన పరీక్షల ఫలితాలు తిరుగుటపాలో ఉన్నట్టు తెలుస్తోంది.

మొదటి బ్యాచ్ లో 24 శాంపిల్స్ ని పంపితే 18 ఫలితాలు తెలిశాయి. వారిలో ఒకరికి కరోనా వైరస్ సోకిందన్న విషయం నిర్థారణ అయ్యింది. మిగిలిన 17మందికీ టెస్ట్ రిజల్ట్స్ నెగటివ్ వచ్చాయి. రిజల్ట్ పాజిటివ్ వచ్చిన విద్యార్థి రక్త నమూనాలను మళ్లీ ఇంకోసారి పరీక్షించేందుకు పుణెలోని ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించారు.

ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఐసోలేషన్ వార్డులు

కరోనా భయంతో కేరళ మొత్తం వణికిపోతోంది. ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా ఐసోలేషన్ వార్డుల్ని ఏర్పాటు చేస్తున్నారు. వైరస్ విస్తృత స్థాయిలో వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా వీలైనంతగా వైద్య సేవలు అందించి సహకరించాలని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శైలజ విజ్ఞప్తి చేశారు. ప్రైవేట్ హాస్పిటల్స్ లో డాక్టర్లకు, నర్సులకు అసలు ఈ వైరస్ కనిపిస్తే రోగుల్ని ఎలా ట్రీట్ చేయాలో తెలుసుకునేలా పూర్తి స్థాయిలో శిక్షణ ఇస్తున్నారు. మొత్తంగా కేరళలో ఎక్కడ కరోనా కొత్త కేసు కనిపించినా సరే సెంట్రల్ కంట్రోల్ రూమ్ కి వెంటనే సమాచారం వచ్చేలా ఏర్పాట్లు చేశారు. ఎవరికైనా కరోనా వైరస్ సోకితే, వైద్య సాయం అవసరమైతే వెంటనే ఈ కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేసి చెబితే ఆగమేఘాలమీద స్పందించి, రోగులకు సత్వర సాయం అందించేందుకు ఏర్పాట్లు చేశారు.

వూహాన్ నుంచి వచ్చిన వారికోసం స్పెషల్ క్యాంప్

చైనాలోని వుహాన్ నుంచి వెనక్కి తిరిగొస్తున్న భారతీయ విద్యార్థుల్లో కేరళకు చెందినవాళ్లు కూడా ఉన్నారు. దీంతో వుహాన్ నుంచి తిరిగొచ్చిన వాళ్లను అసలు మిగతా జనంతో కలిపే ప్రశ్నే లేకుండా పూర్తి స్థాయిలో వాళ్లకోసం ఓ స్పెషల్ క్యాంప్ ని ఏర్పాటు చేసింది కేరళ ప్రభుత్వం. కోస్ట్ గార్డ్ అధికారులు ఈ క్యాంప్ బాధ్యతల్ని పర్యవేక్షిస్తారు. వుహాన్ నుంచి భారత్ కు తిరిగొచ్చిన విద్యార్థుల్లో దాదాపు నలభైమంది కేరళకు చెందినవాళ్లేననీ తెలుస్తోంది. ఎయిర్ పోర్ట్ లో దిగగానే ఒక్కొక్కరికీ పూర్తిగా వైద్య పరీక్షలు చేయించి అందరినీ పూర్తి గా చెక్ చేశాక ఇళ్లకు పంపుతారు. వారిలో వైరస్ సోకిందన్న అనుమానం కలిగిన వాళ్లను క్యాంప్ కు తరలించనున్నారు. మరోపక్క చైనా మాత్రం కరోనా వైరస్ సోకిన వాళ్లెవరైనా సరే చైనాలోనే వైద్యం చేయించుకోవచ్చనీ, దానికోసం దేశం విడిచిపెట్టి వెళ్లాల్సిన అవసరం లేదనీ అధికారికంగా అప్పీల్ చేసింది.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.