వర్మ తీసిన ఆ సినిమా వచ్చే వరకూ ఫిలింఫేర్ అవార్డుల్లో ఆ కేటగిరీనే లేదట..!
By సుభాష్ Published on 10 Sep 2020 5:52 AM GMTరామ్ గోపాల్ వర్మ.. ఇప్పుడంటే ఏదో కొందరిని ఆడుకోవాలని, నేనింతే ఇలానే తీస్తా అంటూ ఇష్టమొచ్చిన సినిమాలను రామ్ గోపాల్ వర్మ తీస్తున్నారు కానీ..! ఒకప్పుడు ఎన్నో మంచి మంచి సినిమాలు.. ట్రెండ్ ను మార్చే సినిమాలు తీశారు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన గొప్ప సినిమాల్లో 'రంగీలా' సినిమా కూడా ఒకటి.
రంగీలా సినిమా వచ్చి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలు చిత్రానికి పని చేసిన వారు చెప్పుకొచ్చారు. 25 సంవత్సరాల కిందట ఫిలింఫేర్ అవార్డుల్లో కాస్ట్యూమ్ డిజైన్ అనే విభాగంలో అవార్డు అన్నదే లేదట. 1995 లో వచ్చిన రంగీలా సినిమా కారణంగా 'కాస్ట్యూమ్ డిజైన్' అనే విభాగాన్ని తీసుకుని వచ్చారు. మొదటి అవార్డు రంగీలా సినిమాకే ఇచ్చారు. మనీష్ మల్హోత్రా కాస్ట్యూమ్ డిజైనర్ గా మొట్టమొదటి అవార్డు అందుకున్నాడు.
ఊర్మిళా మటోండ్కర్, ఆమిర్ ఖాన్, జాకీ ష్రాఫ్ నటించిన సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మనీష్ మల్హోత్రా మంగళవారం నాడు ఆ సినిమాకు సంబంధించిన వీడియో క్లిప్ ను పోస్టు చేసి.. మొట్ట మొదటిసారి ఈ సినిమా చూసిన తర్వాత ఫిలింఫేర్ అవార్డుల్లో కాస్ట్యూమ్ డిజైన్ అవార్డును తీసుకుని వచ్చారని చెప్పుకొచ్చాడు. ఊర్మిళ చేసిన పాత్ర ఒక ట్రెండ్ సెట్టింగ్ అని.. సినిమా ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతుందని అన్నాడు. రంగీలా సినిమా తనకు ఎప్పటికీ స్పెషల్ అని చెప్పుకొచ్చాడు. రామూజీ(రామ్ గోపాల్ వర్మ), ఊర్మిళ నేను కలిసి ఊర్మిళ లుక్స్ విషయంలో ఎంతో సేపు చర్చిస్తూ వచ్చామని అన్నారు. తన పోస్టులో జాకీ ష్రాఫ్ ను, ఆమిర్ ఖాన్ ను కూడా పొగుడుతూ పలు వ్యాఖ్యలు చేశాడు.
రంగీలా సినిమాలో లవ్ ట్రయాంగిల్ ను చూడొచ్చు. హీరోయిన్ అవుదామనుకున్న నటి జీవితంలో ఉన్న స్నేహితుడు మున్నా(ఆమిర్ ఖాన్) నటుడు రాజ్ కమల్ (జాకీ ష్రాఫ్) మధ్య జరిగే ప్రేమ సంఘర్షణ ఈ సినిమాలో రామ్ గోపాల్ వర్మ చూపించాడు. ఏఆర్ రెహమాన్ మొదటి హిందీ సినిమా కావడం విశేషం. ఆడియో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సినిమా అంతకు మించిన హిట్ గా నిలిచింది.